Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగీకరించని బీజేపీ..
- నాడు నోట్లకోసం క్యూలైన్లు... నేడు చితికీ దక్కని చోటు
న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌వేవ్ భారత్ వెన్నులో వణుకుపుట్టిస్తున్నది. కోవిడ్ తమను ఎప్పుడు.. ఎలా.. కాటేస్తుందోనన్న భయం దేశప్రజానీకాన్ని వెంటాడుతున్నది. కానీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు మాత్రం అలాంటి సంకటమేదీలేదని బుకాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాడు నోట్లకోసం క్యూలైన్లలో నిలబడి 200 మందికిపైగా చనిపోతే... ఇపుడు దేశంలోని ప్రధాన నగరాల్లో చితికి చోటుదక్కటంలేదు. మృతదేహాలను పెద్దపెద్ద క్యూలైన్లు పెట్టి.. అంత్యక్రియల కోసం వారి బంధువులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. 16 నుంచి 20 గంటలవరకూ అంత్యక్రియలు నిర్వహించటానికి సమయం పడుతున్నదని బంధువులు చెబుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. కాషాయ పార్టీ మాత్రం కోవిడ్ లెక్కలు, మరణాలను గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నది.
యూపీలో..
'గతమూడు రోజులుగా కోవిడ్ కేసులు తగ్గారు ఆక్సిజన్, మందుల కష్టాల్లేవ్. ఆస్పత్రుల్లో ఆక్సిజన్లేదని తప్పుడు ఆరోపణలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం' యూపీ సీఎం యోగి సర్కార్ ప్రకటన ఇది. మీరట్‌లో ఆక్సిజన్ అందక 21 మంది చనిపోయారు. తన సొంతరాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగినా దాన్ని యోగి సర్కార్ సీరియస్‌గా తీసుకోలేదు. వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి లోనూ లేదు. పైగాఆస్పత్రి యాజమాన్యాలను బెదిరించే ధోరణితో యూపీ సీఎం ఇస్తున్న ప్రకటనలతీరు సర్వత్రా చర్చనీ యాంశమవుతున్నది.
గుజరాత్..
దేశానికే గుజరాత్ మోడల్ అని చెప్పుకున్న మోడీ, అమిత్‌షా కండ్లకు ఆ రాష్ట్రంలో కరోనా పేషెంట్లు పడుతున్న కష్టాలు, బాధలు కనిపించటంలేదు. ఏకంగా నాలుగు వేల ఆస్పత్రుల్లో నాలుగువేల మంది పేషెంట్లు ఆక్సిజన్ లేక అవస్థలుపడుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందకపోతే బలవంతంగా బయటకుపంపాల్సి వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (సూరత్) హెచ్చరిక చేసిందంటే గుజరాత్లో కోవిడ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అవగతమవుతున్నది.
మధ్యప్రదేశ్‌లోనూ..
బీజేపీ పాలిత మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ కరోనా కేసులు, మరణాలు భయపెడుతున్నాయి. భోపాల్‌లోని ఓ శ్మశానవాటికలో ఒక్కరోజే 40కిపైగా కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారంటే.. మధ్యప్రదేశ్‌లో వైరస్ ఎంతగా పంజా విసురు తున్నదో స్పష్టమవుతున్నది. అయితే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలు వాస్తవ మరణాలను దాచిపెడుతున్నాయి. మోడీ మెహర్బానీ కోసం లెక్కలను దాచిపెట్టినంతమాత్రాన.. గణాంకాలు మరుగున పడిపోతాయా? అని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కరోనా గణాంకాలు చెబితే...చనిపోయినవారు బతికొస్తారా..!
కోవిడ్ మరణాలపై హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆ లెక్కలు చెబితే చనిపోయినవారు బతికొస్తారాని ఎదురు ప్రశ్నించారు. మనుషుల ప్రాణాలను అంతచులకన చేసి మాట్లాడిన సీఎం తీరును చూసి మీడియా మిత్రులు అవాక్కయ్యారు.
ఆక్సిజన్ పంపండి...
కరోనా పేషెంట్లను గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు లైట్ తీసుకుంటుంటే అందుకు భిన్నంగా కేరళ, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు మాత్రం ప్రధాని మోడీ, అమిత్‌షాలకు లేఖలు రాస్తూనే ఉన్నారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమ్‌డెసివర్ నిల్వలు పంపాలని కోరుతూనే ఉన్నారు. దేశంలో కరోనా విలయంలా మార్చేస్తున్నా బీజేపీ అండ్ కోకు మాత్రం చీమకుట్టిన ట్టుగా లేదు. పైగా ఇక్కడి వాస్తవ పరిస్థితులను అంతర్జాతీయ మీడియాలో హల్చల్చేస్తుంటే..దాన్ని ఎలాగైనా తిప్పికొట్టడానికి మోడీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది.