Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోదశలో కరోనా ఉగ్రరూపం
- ఒక్కరోజులోనే 3.60లక్షల కేసులు, 3,293మంది మృతి
- 150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతం
- కోవిషీల్డ్ టీకా ధర తగ్గింపు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,01,187 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. రోజువారీ మరణాలు తొలిసారి మూడు వేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో 3,293 మంది మరణించారు. 3,60,960 పాజిటివ్ కేసులు నమోదవగా, 2,61,162 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 1,48,17,371గా ఉంది. దేశంలో రికవరి రేటు 82.33 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 25,56,182 వ్యాక్సిన్ డోసులు అందజేయగా, దేశంలో ఇప్పటి వరకు 14,78,27,367 వ్యాక్సిన్ డోసులు అందజేశారు. ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మొత్తం మరణాల్లో అత్యధికం మహారాష్ట్ర (66,179) నుంచే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (15,009), కర్నాటక (14,807), తమిళనాడు (13,728), యూపీ (11,678), పశ్చిమ బెంగాల్ (11,082), పంజాబ్ (8630), ఆంధ్రప్రదేశ్ (7800), ఛత్తీస్‌గఢ్ (7782) లు ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ (81) కరోనాతో ముంబయిలోని కాండి ఆస్పతిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు.
150 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15శాతం
దేశంలో కరోనా రోజు రోజుకు విజంభిస్తున్నది. ముఖ్యంగా పలు జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్నది. దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో కరోనా పాజివిటీ రేటు 15శాతానికి చేరింది. ఈ క్రమంలో లాక్డౌన్ దిశగా ప్రతిపాదనలు వెల్లువెత్తుతుండగా.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలోనూ ఆరోగ్య మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్రం తుదినిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం పేర్కొంది. పలు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వచ్చే కొన్ని వారాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు జిల్లాల్లో లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని మా విశ్లేషణ సూచిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
రాష్ట్రాలకు కోవిషీల్డ్ ధర రూ.300
రాష్ట్రప్రభుత్వాలకు సరఫరా చేస్తున్న కోవిషీల్డ్ టీకాను రూ.400 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్టు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్వీట్ చేశారు. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.150 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రయివేటు ఆస్పత్రులకు రూ.600 చొప్పున ధరలను నిర్ణయించడంపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వ్యాక్సిన్ ధరలు తగ్గించాలని ఇటీవల కేంద్రం కోరింది. ధర తగ్గించాలన్న తమ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు ఆదా కావడంతోపాటు ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు దోహదం చేస్తుందని ఆ ట్వీట్లో సీరం సీఈఓ పేర్కొన్నారు.
ప్రయివేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం .. నలుగురు మృతి
మహారాష్ట్రలోని థానే ప్రైమ్ క్రిటికేర్ ప్రయివేటు ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు సహా 20 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలతో ఎవరూ మరణించలేదని, ప్రమాదం తరువాత పొగ పీల్చడం వల్ల మరణించి ఉండవచ్చునని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు.
వీలైనంత త్వరగా టీకాలు : ఐఎఫ్ఆర్సీ
కరోనా క్లిష్టమైన దశలోకి ప్రవేశిస్తోందని, వీలైనంత త్వరగా పెద్దలందరికీ టీకాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల (ఐఎఫ్ఆర్సీ)ల దక్షిణాసియా అధిపతి ఉదయ రెగ్మి అన్నారు. ''ఇది నైతిక, ప్రజారోగ్య అత్యవసరం'' అని ఆయన చెప్పారు.
గోవాలో మే 3 వరకూ లాక్డౌన్
కరోనా చైన్‌ను బ్రేక్ చేసేందుకు గోవా ప్రభుత్వం ఈనెల 29వ తేదీ రాత్రి నుంచి మే 3వ తేదీ ఉదయం వరకూ రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌ను విధించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో నిత్యావసర సర్వీసులు, పరిశ్రమలు మూతపడవని చెప్పారు.