Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారికంగా లాక్డౌన్ లేకున్నా.. అన్నీ బంద్
- ఏప్రిల్‌లో 11శాతం తగ్గిన రైల్వే సరుకు రవాణా
- పట్టణాల్లో 10శాతం దాటిన నిరుద్యోగరేటు
- ఉత్తచేతులతో రోడ్డుపైన పేదలు, అసంఘటితరంగ కార్మికులు
కరోనా రెండో వేవ్‌తో ఉపాధి ఢమాల్
గత ఏడాది మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితులు లేవు. ఏకపక్షంగా మోడీ సర్కార్ 2020, మార్చిలో లాక్డౌన్ విధించి..దేశ ప్రజలందర్నీ కష్టాల్లోకి నెట్టింది. వైరస్ ఉధృతి అంతగా లేకపోయినా.. కఠిన నిర్ణయాలతో హడలెత్తించింది. ఫలితం..ఉపాధికి దూరమై పేదలు, సామాన్యాలు, మధ్య తరగతి రోడ్డునపడ్డారు. సరిగ్గా మళ్లీ ఏడాది తిరిగేసరికి.. అవే పరిస్థితులు దేశ ప్రజల్ని వెంటాడుతున్నాయి. వైరస్ రెండో వేవ్‌తో దేశంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలన్నీ కుదేలయ్యాయి.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తాకిడికి మనదేశంలోని ప్రజా ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రజల ఆరోగ్యంపైనా, వారి ఆర్థిక స్థితిని వైరస్ తీవ్రంగా దెబ్బకొట్టింది. తాజా అధ్యయనం ప్రకారం, దేశంలో సగటు నిరుద్యోగం 8.4శాతానికి చేరుకుంది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు (సీఎం ఐఈ) ఏప్రిల్‌లో 10శాతం దాటింది. ఒక ప్రణాళికలేకుండా, ఏకపక్షంగా మోడీ సర్కార్ లాక్డౌన్ విధించటం దేశ ఆర్థికవ్యవస్థను పతనం చేసిందని, ఇప్పుడు రెండో వేవ్‌ను సరిగ్గా ఎదుర్కొలేక గత ఏడాది పరిస్థితులే పునరావృతమయ్యాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని ఇటీవల జరిగిన రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ సూచించారు. అయితే అనేక రాష్ట్రాల్లో అనధికారికంగా లాక్డౌన్ అమలవుతోంది. వైరస్ రెండో వేవ్ సంగతి తెలిసాక, ప్రజలెవరూ బయటకు రావటం లేదు. ప్రయివేటు కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. నగరాల్లో అడ్డమీద కూలీలు ఉపాధి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా కూడా దేశ ఆర్థికరంగాన్ని మళ్లీ తీవ్రంగా ప్రభావతం చేయనుందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక పతనం మొదలైంది..
రెండో వేవ్ ప్రభావం ఆర్థికరంగాన్ని తాకిందని అనేక వైపుల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. రైలు, రోడ్డు రవాణా నామమాత్రంగా నడుస్తోంది. మనదేశంలో పారిశ్రామిక సరుకుల్లో 30శాతం రవాణా రైళ్ల ద్వారా జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తు డిమాండ్‌కు రైల్వే సరుకు రవాణా ప్రధాన సూచికగా తీసుకుంటారు. భారతీయ రైల్వే అధికారిక గణాంకాల ప్రకారం, రైల్వే సరుకు రవాణా ఏప్రిల్‌లో 11శాతం పడిపోయింది. అలాగే రోడ్డు మార్గంలోనూ సరుకు రవాణా గణనీయంగా పడిపోయింది. మార్చిలో రోజువారీ సగటు ఈ-వే బిల్లులు 23లక్షలుకాగా, ఏప్రిల్‌లో అది 20లక్షలకు తగ్గింది.
వర్తక, వాణిజ్య కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయని 'నోమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్' తెలిపింది. గూగుల్ మొబిలిటీ, ఆపీల్స్ డ్రైవింగ్ మొబిలిటీ, పవర్ డిమాండ్ ఇన్ ఇండియా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ (కార్మికశక్తిలో కార్మికుల ప్రాతినిథ్యాన్ని తెలుపుతుంది)..వీటి ఆధారంగా 'నోమురా' నివేదిక తయారుచేసింది. వైరస్ కేసులు పెరగటం ప్రభుత్వ, ప్రయివేటు కార్యకలాపాల్ని తగ్గించిందని నివేదిక తెలిపింది. నోమురా బిజినెస్ ఇండెక్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 99.3 ఉంటే, ఏప్రిల్ 11నాటికి 90.4కు పడిపోయింది.
వెంటాడుతున్న భయం
వైరస్ రెండో వేవ్ దేశ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగుళూరు, హైద్రాబాద్..ఇలాంటి మెట్రో నగరాల్లోనే కాదు, మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పూర్తిగా అమలుజేస్తున్నారు. 'యాపిల్స్ డ్రైవింగ్ ఇండెక్స్' (యాపిల్ మొబైల్ తయారీ కంపెనీ) సూచిక ప్రకారం, ఏప్రిల్ నెలలో స్మార్ట్ ఫోన్లలో 'రూట్ మ్యాప్' వెదకటం చాలావరకు తగ్గింది.
నిరుద్యోగం..
గత ఏడాది లాక్డౌన్ వల్ల నిరుద్యోగం అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో కార్మికులు రోడ్డునపడ్డారు. ఏప్రిల్, 2020లో దేశంలో నిరుద్యోగ రేటు 23శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో జాబ్ మార్కెట్ పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో రెండో వేవ్ మొదలైంది. ఫిబ్రవరి, 2021లో నిరుద్యోగరేటు 6.9శాతం నమోదుకాగా, ఏప్రిల్ నాటికి 8.4శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగరేటు (సీఏంఐఈ అంచనా) 10శాతాన్ని దాటింది. పట్టణాల్లో కరోనా రెండో వేవ్ అధిక ప్రభావం చూపిందన్నది ఇక్కడ స్పష్టమవుతోంది.