Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో బీడీ కార్మికుని గొప్పతనం
తిరువనంతపురం: అతను ఒక సాధారణ బీడీ కార్మికుడు. వారానికి సుమారు 1000 రూపాయిల వరకూ సంపాదిస్తాడు. అయితేనేం కరోనా కష్టకాలంలో తాను దాచుకున్న సొమ్ము, తన భార్య మరణించగా వచ్చిన పరిహారం మొత్తాన్ని వాక్సిన్ ఫండ్ కోసం విరాళంగా ఇచ్చాడు. అందరికీ స్ఫూర్తిగా నిలిచే ఈ సంఘటన కేరళలో జరిగింది. జనార్థన్ అనే వ్యక్తి దినేష్ బీడీ కంపెనీలో 35 ఏళ్లుగా పని చేస్తున్నాడు. వారానికి 3000 నుంచి 3500 బీడీలు చుట్టి రూ 1000 వరకూ సంపాదిస్తాడు. ఇటీవల బ్యాంక్ వెళ్లి తన ఖాతాలో ఉన్న రూ రెండు లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని అక్కడి మేనేజర్‌ను కోరడం సంచలనంగా మారింది. తాను దాచుకున్న సొమ్ముతో పాటు, తన భార్య మరణించగా వచ్చిన పరిహారం మొత్తం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి జనార్థన్ వార్తల్లోకి వచ్చాడు. జనార్థన్ తనను తాను 'సగం కమ్యూనిస్టు'గా అభివర్ణించుకుంటాడు. కమ్యూనిస్టు అంటే పార్టీ కోసం ప్రాణాలను కూడా త్యాగం చేసేవాడని, తాను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వలేను కాబట్టి సగం కమ్యూనిస్టునేని అతని అభిప్రాయం.
వ్యాక్సిన్ ఛాలెంజ్‌కు భారీ స్పందన
కేరళలోని విజయన్ ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన 'వ్యాక్సిన్ ఛాలెంజ్'కు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. కేరళ ప్రభుత్వమే వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని బిజెపి నేత, కేంద్ర మంత్రి వి మురళీధరన్ సవాల్ చేశారు. కేరళకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వం అని చెప్పాడు. మురళీధరన్ వ్యాఖ్యల తరువాత ఈ వ్యాక్సిన్ ఛాలెంజ్ ప్రారంభమయింది. ఏ పార్టీ కూడా పిలుపు ఇవ్వకపోయినా ప్రజలు స్వచ్చంధంగా ఈ వ్యాక్సిన్ ఛాలెంజ్‌ను ప్రారంభించడం విశేషం. 70 లక్షల వ్యాక్సిన్ డోసులు కొనుగోలుకు కేరళ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.
దీనికి 460 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు భారీగా సిఎం ఫండ్‌కు విరాళలు పంపుతున్నారు. రాష్ట్రంలో నివశించేవారితో పాటు దేశంలో, ప్రపంచంలో నివసించే కేరళ ప్రజల నుంచి ఈ విరాళాలు వస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు కూడా విరాళాలు అందిస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీలు వరకూ విరాళాలు పంపడం వారిలో విజయన్ ప్రభుత్వానికి ఉన్న ఆదరణను తెలియచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.