Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హ్యాష్‌ట్యాగ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయడంలో విఫలమైన ప్రధాని మోడీ రాజీనామా కోరుతూ వైరల్ అయిన 'రిజైన్‌మోడీ' హ్యాష్‌ట్యాగ్‌ను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పునరుద్ధరించింది. దేశ, విదేశాల్లో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో సదరు హ్యాష్‌ట్యాగ్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను కారణంగా పేర్కొంటూ 'రిజైన్‌మోడీ' హ్యాష్‌ట్యాగ్‌ను ఫేస్బుక్ సంస్థ బుధవారం తాత్కాలికంగా తొలగించిన విషయం విదితమే. అయితే, ఈ చర్య యూజర్ల ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఫేస్బుక్ తిరిగి అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. '' హ్యాష్‌ట్యాగ్‌ను పునరుద్ధరించాం. ఈ విషయంలో ఏం జరిగిందన్నదానిపై దృష్టిసారిస్తాం'' అని ఫేస్బుక్ ప్రతినిధి ఆండీ స్టోన్ ట్వీట్ చేశారు. అయితే, సదరు హ్యాష్‌ట్యాగ్ బ్లాక్ విషయంలో తప్పు జరిగిందని చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో దేశంలో రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాల కొరత ఏర్పడి దేశంలో వేలాది మంది కరోనా రోగుల మరణాలకు కారణమవుతున్న విషయం విదితమే. ప్రస్తుత తీవ్ర పరిస్థితులకు మోడీనే కారణమనీ, ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాలంటూ సోషల్‌మీడియాలో 'రిజైన్‌మోడీ' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారింది.