Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ సన్నద్ధతపై కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి సరైన ప్రణాళిక లేకుండా గత 14నెలల నుంచి ఏం చేస్తున్నారని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా ఉధృతిని ఎదుర్కొనడంలో తాత్కాలిక చర్యలు, వైఖరి ఉండరాదని పేర్కొంది. ఇప్పుడు హడావిడిగా చర్యలు తీసుకోవడానికి బదులుగా ముందుగానే ఒక క్రమ పద్ధతిలో వ్యవహరించి, నిపుణుల సలహాలతో ముందుకు సాగాల్సిందని అభిప్రాయపడింది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.శంకర నారాయణన్ వివరించినపుడు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ పై వ్యాఖ్యలు చేశారు. సెకండ్‌వేవ్‌ను ఊహించలేదని కేంద్రం తెలిపింది. కోర్టు తనకు తానుగా పరిగణనలోనికి తీసుకుని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించింది. అంతకుముందు మే 2న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నందున ఆరోజు పూర్తిగా లాక్డౌన్ విధించాలని భావించినట్లు అడ్వకేట్ జనరల్ విజరు నారాయణ్ ఫస్ట్ డివిజన్ బెంచ్‌కు తెలియజేశారు. మే 1న ఎలాగూ సెలవు దినమే కాబట్టి ఆ రోజు లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
ఓట్ల లెక్కింపు ఏజెంట్లు, మీడియా సిబ్బంది పాటించాల్సిన కోవిడ్ నిబంధనలను కూడా రూపొందించామని చెప్పారు. ఆరోగ్య కార్యదర్శి, ముఖ్య ఎన్నికల అధికారితో చర్చల అనంతరం వీటిని రూపొందించామన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, విజయోత్సవాలు, ప్రదర్శనలు వంటి వాటినన్నింటినీ నివారించాల్సిందిగా రాజకీయ పార్టీలను ప్రధాన న్యాయమూర్తి కోరారు. రాజకీయ నేతలు విజయోత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలన్నారు.