Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్మశానవాటికల్లో జాగాలేదు..
మీరే దహనసంస్కారాలు చూసుకోండి... : పలు రాష్ట్రాల్లో ఇదే తీరు
ఘజియాబాద్ : యూపీలో కోవిడ్వైరస్తో చనిపోయిన పేషెంట్లకు దహనసంస్కారాలు నిర్వహించటం పెద్ద సవాలుగా మారింది. ఎలా నిర్వహించాలో... బంధువులకు అంతుచిక్కటంలేదు.. శ్మశానవాటికల్లో జాగాల్లేవ్. మీరే అంత్యక్రియలు నిర్వహించుకోమని నిర్వాహకులు చెబుతుంటే.. రోడ్ల పక్కన పేవ్మెంట్లపైనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్ నది ఒడ్డున ఉన్న ఘాట్ వద్ద మృతదేహాలను సామూహికంగా దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. శ్మశానవాటికలో స్థలంలేకపోవటంతో.. అవతలి వైపు ఉన్న పేవ్‌మెంట్‌పై 35కు పైగా మృతదేహాలక సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించినట్టు మృతుల బంధువులు తెలిపారు. వీరంతా కరోనా యుద్ధంలో ఓడిపోయినవారేనని బంధువులు చెబుతున్నారు. అయితే ఇలా తగలబెట్టిన శవాలకు మరణధ్రువీకరణ పత్రాలు ఇతరత్రా సమస్యలు వస్తాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. ఆస్పత్రిలో చనిపోయినవారికి సంబంధించినంతవరకూ డెత్ సర్టిఫికెట్ పరంగా ఎలాంటి ఇబ్బందిఉండదని భావిస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించటానికి పీపీఈ కిట్లు ధరించి గంటలతరబడి ఎదురుచూడకతప్పటంలేదు. ప్రభుత్వ అంబులెన్స్‌లు అందుబాటులోలేకపోవటంతో..ప్రయివేటు వాహనాల్లో కోవిడ్ మృతదేహాలను తీసుకువస్తున్నారు. రహదారిపై పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పలు అంబులెన్స్‌ల నంబర్ ప్లేట్లు లేకపోవటం గమనార్హం.
తన తండ్రి అంత్యక్రియల కోసం సుమారు ఆరు గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని ఓ మహిళ తెలిపింది. పీపీఈ కిట్లోనే నిలబడి ఉన్నది. ఆమెతో పాటు వచ్చిన బంధువులు విలపిస్తూనే ఉన్నారు. ఇక ఢిల్లీలో రోజూ కరోనా వైరస్‌బారినపడి 700మంది వరకు మరణిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కర్నాటకలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ప్రజలు తమ పొలాలు, ఇండ్ల వెనుక భాగాల్లో దహనసంస్కారాలు నిర్వహించుకోమని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోనూ కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించటం కష్టమవుతున్నదని బంధువులు అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలా దయనీయస్థితిలో దహనసంస్కారాలు కానిచ్చేయాల్సి వస్తున్నదని బంధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.