Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశమంతా కొవిడ్ కోరలు చాచిన నేపథ్యంలో ఆ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు కరువయ్యాయి. నిర్ణయాక క్రమం ఒకేచోట కేంద్రీకృతమవడం, కేవలం సందేశాలివ్వడంపైనే దృష్టి పెట్టడం వంటి పలు చర్యల కారణంగా పరిస్థితులు మరింత దుర్భరంగా తయారవుతున్నాయి. ఒకపక్క ప్రాణ వాయువు లేక బాధితులు ఆల్లాడుతుంటే మరోపక్క ప్రభుత్వ నేరపూరితమైన బాధ్యతారాహిత్యం ప్రస్ఫుటంగా ప్రదర్శితమవుతోంది.
దేశంలో రోజువారీ నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. మొత్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల రంగం కుప్పకూలింది. ఆక్సిజన్ వంటి కీలకమైన సరఫరాలు అడుగంటుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఐసియులు నిండిపోయాయి. కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్లనే పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేలాదిమంది ప్రజలు ఇళ్ళ దగ్గరైనా ఆక్సిజన్ సిలిండర్లను పెట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు. మొత్తంగా కొవిడ్ రోగులు నిస్సహాయులవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరి పీల్చుకోవడానికి కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సెకండ్ వేవ్‌ను ముందుగానే ఊహించడంలో, అవసరమైన సన్నద్ధతను చేపట్టడంలో కేంద్రం విఫలమైంది.
ఆక్సిజన్‌కు అసాధారణ రీతిలో డిమాండ్ పెరగడం, మరోపక్క మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పడిపోవడం, పంపిణీలో సమస్యలు ఇవన్నీ కలిసి కేంద్రం నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని తెలియచేస్తున్నాయి. భారత్‌లో పారిశ్రామిక, వైద్య అవసరాల నిమిత్తం రోజువారీ 7,127టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం వుంది. రెండింటి అవసరాలకు ఆక్సిజన్ ఒకే తీరున తయారవుతుంది. 95శాతం నుండి 99శాతం వరకు స్వచ్ఛత వుంటుంది. అయితే వాటిని నిల్వ చేసిన కంటెయినర్లు లేదా రవాణా చేసే కంటెయినర్లలోనే ప్రధానమైన తేడా వుంటుంది. మెడికల్ ఆక్సిజన్కైతే కాలుష్యం చాలా తక్కువ స్థాయిలో వుండాలి, పైగా సంబంధిత సర్టిఫికెట్ వుండాలి. ఆక్సిజన్ సరఫరాల్లో కొరత కాదని, వాటి రవాణాలోనే సమస్య అని యుపి ప్రభుత్వ ప్రతినిధులు, సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియచేశారు. వీటికి తోడు బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, ప్రభుత్వ నిర్వహణా లోపం సమస్యను మరింత పెంచుతున్నాయని చెప్పారు. అయితే గణాంకాలను నిశితంగా పరిశీలించినట్లైతే మొత్తంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో కొరత వుందనేది స్పష్టమవుతోంది. ఇండిస్టియల్ ఆక్సిజన్‌ను ఇటు వైద్య అవసరాలకు మళ్లించడమనేది కూడా తాత్కాలిక స్వల్పకాలిక చర్య మాత్రమే. ఎందుకంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మొదటి వేవ్ సందర్భంగా కొరతను ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడానికి అసలు చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది.
ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెంట్రేటర్లే కాకుండా మెడికల్ పరికరాల కొరత వంటి ఇతర సమస్యలు కూడా వున్నాయి. వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు వంటి వాటి కోసం తలెత్తిన డిమాండ్‌ను మొదటివేవ్లో జాగ్రత్తగా పరిష్కరించినా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లపై దృష్టి మాత్రం పెట్టలేదు. అదే ఇప్పుడు పెద్దసమస్యగా మారిందని నిపుణులు భావిస్తున్నారు. గతేడాది వెంటిలేటర్ల విషయంలో బిహెచ్ఇఎల్ని సంప్రదించిన రీతిలోనే ఈసారి ప్రభుత్వం దేశీయ ఉత్పత్తి పెంపు కోసం బిహెచ్ఇల్ను సంప్రదించాలని పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులు సూచిస్తున్నారు.
హౌం ఐసోలేషన్.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడి ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులకు సంబంధించి కేంద్రం ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. హౌం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్‌ను వినియోగించాలని సూచించింది. ఎనిమిది గంటల తర్వాత వాటిని పడేయాలని తెలిపింది. అలానే హౌం ఐసోలేషన్‌లో ఉన్న వారి వద్దకు కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే.. బాధితుడు, కుటుంబ సభ్యుడు ఇద్దరూ ఎన్ 95 మాస్క్ ను ధరించాలని స్పష్టం చేసింది. 1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్‌ను తొలగించాలని సూచించింది. కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. దేశంలో ఒకే రోజు 3,79,257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకోగా యాక్టీవ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : ఐసీజే విమర్శ
న్యూఢిల్లీ : అంచనా వేయదగిన కరోనా రెండో దశకు సన్నద్ధం కావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జురిస్ట్స్ (ఐసీజే) విమర్శించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకలు, కోవిడ్-19 కోసం ఔషధాలను ప్రభుత్వాలు సమకూర్చుకోలేదని ఆరోపించింది. కరోనా రెండో దశ తీవ్రతరం కావడానికి కారణమైన వైఫల్యాలను భారత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐసీజే ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. అలాగే వైద్య రక్షణ, వ్యాక్సిన్లుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
మహామ్మారి రెండో దశకు సన్నద్ధం కావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే దేశంలో వైరస్ తీవ్ర విజృంభణకు కారణమయిందని ఐసీజే ప్రధాన కార్యదర్శి సామ్ జరిఫ్ తెలిపారు. రోజువారీ కేసులు, మరణాలు భారత్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని ఐసీజే గుర్తు చేసింది.