Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ యూపీలో ఘోరం
లక్నో: బీజేపీ పాలిత ఉత్తప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆక్సిజన్ అందక 17 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన యూపీలోని మొరాదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మజోలా పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రైట్ స్టార్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన జరిగింది. గురువారం ఉదయం 3 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో వరుస మరణాలు సంభవించాయని సమాచారం. విషయం తెలిసిన రోగుల బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వెలుపల మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
అయితే, ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించలేదని పేర్కొంది. ఆస్పత్రిలో తగినంతగా ఆక్సిజన్ ఉందని తెలిపింది. అలాగే, ఆరు మంది రోగులు మాత్రమే చనిపోయారని వెల్లడించింది. అయితే, మృతుల కుంటుంబాలు మాత్రం ఆక్సిజన్ అందకే ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఇస్త్రో శాస్త్రవేత్త రజత్ కుమార్ తండ్రి సైతం ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. తన తండ్రి బాగానే ఉన్నారనీ, మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని డాక్టర్ తెలిపారు కానీ గురువారం ఉదయం మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఆరుగురు మాత్రమే చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి కానీ మతుల కుటుంబాలు సంతకాలు చేసిన కాగితాన్ని చూపిస్తూ 17 మంది చనిపోయారని చెప్పారు. కాగా, ఆస్పత్రి వెలుపల మృతుల కుంటుంబాలు ఆవేదనతో రోదిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో 15-20 మంది రోగుల మరణాల గురించి వారి బంధువులు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.