Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలు, ఎస్కేఎం పిలుపు
న్యూఢిల్లీ: రైతులు, కార్మికులు, ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా ''మేడే''ను ఘనంగా నిర్వహించాలని కార్మిక సంఘాలు, ఎస్కేఎం పిలుపు నిచ్చాయి. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (సీటియూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆన్లైన్లో సమావేశమయ్యాయి. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పోరాటాలను తీవ్రతరం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధ్వంసక విధా నాలు, రైతులు, వ్యవసాయం, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని నాశనం చేసే వినాశకరమైన విధా నాలకు వ్యతిరేకంగా దేశంలోని రెండు ప్రధాన ఉత్పాదక శక్తులు (కార్మికులు, రైతులు) పోరాటాల మధ్య సంఘీభావం బలమైనదని సమావేశం ప్రశం సించింది. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసా యాన్ని, ఆర్థిక వ్యవస్థ, అన్ని పరిశ్రమలు, సేవలు, సహజ వనరులు, ఆరోగ్యం, విద్యా రంగం ఇలా అన్నింటినీ ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించింది. ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు మొదలైనవాటిని అరికట్టడంతో పాటు కార్మిక కోడ్స్ అమలు చేయడం ద్వారా శ్రామిక ప్రజలను బానిసలుగా మార్చే పరిస్థితులు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి రెండో దశను పరిష్కరించడంలో ప్రభు త్వం అలసత్వం ప్రదర్శించిందని
విమర్శించింది. మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల వల్ల ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ బలహీనపడిందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ విధానం వల్ల ప్రజల సొమ్ముతో లాభాలను ప్రోత్సహించడానికి ప్రయత్నం జరిగిందని తెలిపింది. మహమ్మారి సవాలును ఎదుర్కోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వ అనాగరిక విధానాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. అందరికీ ఉచిత టీకా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఉమ్మడిగా మేడే
దేశవ్యాప్తంగా కార్మికుల, రైతుల, ప్రజల డిమాండ్లు, హక్కులను ప్రతిబింబిస్తూ వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో ఉమ్మడిగా ''మేడే''ను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ప్రజలందరి హక్కులు, జీవనోపాధి సమస్యలపై ఐక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.
మే డే రోజున నిరసనలు : కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
కోవిడ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరితమైన తీరు పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మే డేను పాటించాలని పిలుపునిచ్చాయి. బుధవారం ఆన్లైన్లో జరిగిన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యల సంయుక్త వేదిక సమావేశం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఇంతలా విజృంబిస్తున్నా కేంద్రంలోని ప్రభుత్వం పట్టీ పట్టనట్లుగా, దారుణమైన రీతిలో వ్యవహరించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘాలైన సీఐటియూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఏఐసీసీటీయూ, ఎస్ఈడబ్ల్యూఏ, యూటీయూసీ, ఎల్పీఎఫ్ నేతలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. కార్పొరేట్ అనుకూల, వివక్షాపూరితమైన నూతన వ్యాక్సిన్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలని సంయుక్త వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.