Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కరోనా కల్లోలం
- ఒక్కరోజే 3,645 మరణాలు, 3.79 లక్షల కేసులు
- ఉత్తరప్రదేశ్‌లో సంపూర్ణ లాక్డౌన్
- కఠిన ఆంక్షలు విధిస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు
- రాష్ట్రాలకు రూ.400కే కోవాగ్జిన్
- చార్ధామ్ యాత్ర రద్దు
- హోం ఐసొలేషన్‌కు కేంద్రం నూతన మార్గదర్శకాలు
- నాలుగో స్థాయి ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసిన అమెరికా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం మాములుగా లేదు. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత దేశంలో వైద్య సంక్షోభాన్ని సృష్టించింది. మరీ ముఖ్యంగా రోజురోజుకూ మరణాలు, కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొం టున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,79,257 పాజిటివ్ కేసులు, 3,645 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 2,04,842కు పెరిగాయి. పాజిటివ్ కేసులు 1,83,76,524కు చేరాయి. ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకోగా, ప్రస్తుతం 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 15,00,20,648మందికి టీకాలు వేశారు. కరోనా కేసులు అధికం గా నమోదైన రాష్ట్రాల్లో జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, యూపీ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బెంగాల్,
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు టాప్-10లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు , మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఇదిలా వుండగా, యూపీ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 577 మంది టీచర్లు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ మేరకు యూపీ ఎన్నికల సంఘానికి టీచర్స్ యూనియన్ ప్రతినిధులు.. టీచర్ల మరణాలపై నివేదిక సమర్పించారు. మే 2న జరగాల్సిన కౌంటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని టీచర్లు కోరారు. మహారాష్ట్రలో లాక్డౌన్ ఆంక్షలను వచ్చే నెల 15 వరకు పొడగించాలని ఆలోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే సూచనప్రాయంగా తెలియజేశారు. తమిళనాడు సర్కారు రాష్ట్రంలో విధించిన కరోనా ఆంక్షలను పొడగించింది. ఈ నెల 20న అమలులోకి తీసుకువచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని పేర్కొంది.గోవాలో గురువారం రాత్రి 7 గంటల నుంచి మే 3వరకు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మీడియాకు వెల్లడించించారు. కరోనా నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ మే 7 వరకు కొనసాగుతుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భోపాల్, ఇండోర్‌తో పాటు ప్రముఖ నగరాలు సహా పలు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది.
కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 19 నుంచి ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన సతీమణి కరోనా బారిన పడ్డారు.
రాష్ట్రాలకు రూ.400కే కోవాగ్జిన్
గతంలో రాష్ట్రాలకు రూ.600 చొప్పున ఒక డోసు కోవాగ్జిన్ అందజేస్తామని చెప్పిన భారత్ బయోటెక్ రూ.400కే అందించనున్నట్టు గురువారం ప్రకటించింది. రాష్ట్రాలకు రూ.300కే ఒక డోసు కోవిషీల్డ్ ఇస్తామని బుధవారం సీరం సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారత్ బయోటెక్ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ రెండు సంస్థలు కేంద్రానికి రూ.150 చొప్పున డోసు సరఫరా చేస్తూ, రాష్ట్రాలకు, ప్రయివేటు వ్యక్తులకు అధిక ధరకు ఇస్తామని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కొద్దిమేరకు తగ్గించడం గమనార్హం. టీకా అభివృద్ధి, క్లినికల్ పరీక్షల నిర్వహణ, ఉత్పత్తికి సొంత నిధులు ఖర్చు చేశామని, ఎంతో శుద్ధి చేసిన ఇన్-యాక్టివేటెడ్ టీకాను తయారు చేయడం ఖరీదైన వ్యవహారమని భారత్ బయోటెక్ పేర్కొంది.
నాలుగో స్థాయి ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసిన అమెరికా
అమెరికా తన పౌరులకు లెవెల్ 4 ఆరోగ్య హెచ్చరికను జారీ చేసింది. తమ దేశ పౌరులు వెంటనే ఇండియా విడిచి రావడం సురక్షితమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో పరిమితంగానే వైద్యసేవలందుతున్నాయని తెలిపింది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయని, చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా, బెడ్స్, టెస్టులు తదితర అంశాల్లో కరోనా, కరోనా యేతర రోగులకు ఇబ్బందులు ఉన్నాయని అమెరికా డిపార్ట్్మెంట్ ఆఫ్ స్టేట్ వివరింది.
హోం ఐసొలేషన్‌కు కేంద్రం నూతన మార్గదర్శకాలు
స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేని కోవిడ్ రోగుల హోం ఐసొలేషన్ కోసం సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసింది. నివాసంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు తీసుకోకూడదని, ఆస్పత్రుల్లోనే అవి తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఏడు రోజులకు మించి ఉంటే వైద్యులను తక్షణమే సంప్రదించాలని తెలిపింది. 60 ఏండ్లు దాటిన వారు, రక్తపోటు, షుగర్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వైద్యులు పూర్తిగా పరీక్షించిన తరువాతే హోం ఐసొలేషన్‌లో ఉండాలని తెలిపింది. ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలని పేర్కొంది. వేడి నీటిని పుక్కిలించడం లేదా ఆవిరి పట్టడాన్ని రోజుకు రెండుసార్లు చేయాలని తెలిపింది. అన్ని సమయాల్లో ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ వాడాలని వివరించింది. హోచ్ఐవి పాజిటివ్, అవయవ మార్పిడి గ్రహీతలు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు హోం ఐసొలేషన్‌కు అనుమతించబడరని తెలిపింది. హోం ఐసొలేషన్ ప్రారంభమైన 10 రోజుల తరువాత వరసగా మూడో రోజుల పాటు జ్వరం, ఇతర లక్షణాలు లేకపోతే రోగులు డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. హోం ఐసొలేషన్ ముగిసిన తర్వాత పరీక్ష అవసరం లేదని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.
చార్ధామ్ యాత్ర రద్దు
డెహ్రాడూన్: దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో దశ విజృంభణ ప్రభావం చార్ధామ్ యాత్రపై పడింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటంతో ఈ యాత్రను రద్దు చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల సందర్శనమైన చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 14న ప్రారంభం కావాల్సి ఉన్న చార్ధామ్ యాత్ర రద్దయిపోయినా.. ఆయా ఆలయాల ద్వారాలు తెరుచుకునే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. భక్తులు లేకుండా పూజారుల సమక్షంలోనే నిత్య పూజలు, ఇతర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపింది.
ఆర్టీపీసీఆర్లో సీఎంకు మిశ్రమ ఫలితాలు
మూడు రోజుల తర్వాత మరోసారి టెస్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం నిర్వహించిన యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆయనకు ఈనెల 14న కరోనా సోకిన నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్టు రిపోర్టులో నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రాబోవని ఆయన వివరించారు. కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో మరోసారి సీఎంకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.