Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి మద్దతుగా సోషల్ మీడియా సంస్థల వైఖరి
- స్పందించిన విదేశీ మీడియా
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకున్న సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. 'రిజైన్ మోడీ' హ్యాష్‌ట్యాగ్‌తో పెట్టిన ఈ పోస్టులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్ చేయడం చూస్తుంటే సోషల్ మీడియా సంస్థలపై మోడీ ప్రభుత్వం ఎంతటి ఒత్తిడి తీసుకుని వచ్చిందో మనం ఆర్ధం చేసుకోవచ్చు.
రిజైన్ మోడీ పోస్టులు బ్లాక్ చేయడాన్ని మన దేశంలో మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెంటనే స్పందించడం విశేషం. రిజైన్‌మోడీ హ్యాష్‌ట్యాగ్‌ని బ్లాక్ చేసినట్టుగా మొట్టమొదటగా అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటపెట్టడం గమనార్హం. మోడీ ప్రభుత్వానికి వచ్చిన సుమారు 12 వేల పోస్టును ఫేస్బుక్ బ్లాక్ చేసిందని అమెరికాకే చెందిన ది గార్డియన్ పత్రిక కూడా వెళ్లడించింది.
కాగా, ఈ వివాదం లోకి వెళితే.. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ రిజైన్‌మోడీ హ్యాష్‌ట్యాగ్‌తో ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పోస్టులను కొన్ని గంటలసేపు ఆ సంస్థలు బ్లాక్ చేయడం మరింత వివాదంగా మారింది. ఖాతాదారులు స్వచ్చంధంగా పోస్టులు పెడితే వాటిని సంస్థలు తొలగించడం అన్యాయమని నిపుణులు విమర్శిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఈ పోస్టులను తొలగించలేదని, పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చింది. ''మేము తాత్కాలికంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్ చేశాము. ఇది మా పొరపాటే తప్ప కేంద్రం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పొరపాటున గుర్తించిన వెంటనే దానిని పునరుద్ధరించాం''అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ప్రకటించారు. మరోవైపు ఈ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ కూడా స్పందించడం విశేషం. 'రిజైన్ మోడీ హ్యాష్‌ట్యాగ్ తొలిగించాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఫేస్బుక్ పొరపాటున ఈ పోస్టులు తొలిగించింది' అని కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులను తొలగించడం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్థలకు కొత్తకాదు. దేశవ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్న రైతు ఉద్యమం వార్తలనూ ఈ సంస్థలు బ్లాక్ చేస్తున్నాయి. రైతు ఉద్యమ నేతల ఖాతాలను తొలగిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఈ విధంగా బీజేపీ అనుకూల వైఖరి అవలంబించడంపై అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.