Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్ఎన్ఎల్ను చంపేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల ప్రభావం బీఎస్ఎన్ఎల్పై తీవ్రంగా పడింది. ఆ సంస్థను పూర్తిగా చంపేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఉద్యోగులుగా అనేక పోరాటాలు, ప్రతిఘటనలు చేపడుతున్నాం. అయినా మా శక్తి చాలట్లేదు. ప్రజా మద్దతును కూడగట్టాలి. కేంద్రప్రభుత్వ విధానాలు ఒక్క బీఎస్ఎన్ఎల్కే పరిమితం కాలేదు. దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఇదే తరహా ఒత్తిడిలో ఉన్నాయి. అన్ని సంస్థల ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి, పిడికిలి బిగించి పోరాడితే తప్ప, కేంద్రప్రభుత్వం వెనకడుగు వేసే పరిస్థితి కనిపించట్లేదు. దానికోసమే మేం ప్రయత్నిస్తున్నాం. అనేక సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్ నష్టాలకు కచ్చితంగా ప్రభుత్వ విధానాలే కారణం. ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. సంస్థకు ఇప్పటికీ 2జీ, 3జీ టెక్నాలజీనే ఇచ్చి, సమర్థవంతంగా నడపమంటున్నారు. రిలయన్స్ జియో సహా ప్రయివేటు సంస్థలకు 4జీ అనుమతులు ఇచ్చి, బీఎస్ఎన్ఎల్కు తిరస్కరించారు. సాంకేతికంగా సంస్థ ఉన్నతిని అడ్డుకొని, నష్టాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలి. ఈ ఏడాది బీఎస్ఎన్ఎల్ టవర్లను ప్రయివేటుకు అప్పగించి రూ.40వేల కోట్లు సమీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ టవర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి, ఆ సంస్థల్ని ప్రయివేటు రంగానికి కట్టబెట్టేవిధంగా కేంద్రంప్రభుత్వం విధాన నిర్ణయాలను అమలు చేస్తున్నది. ఇవే విధానాలు కొనసాగితే ప్రభుత్వరంగ అస్తిపంజరాలు మాత్రమే మిగులుతాయి. దీన్ని ప్రజల మద్దతుతో కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ, పోరాటాల ద్వారానే తిప్పికొట్టగలం. అందుకు ప్రతిఒక్కరూ సమాయత్తం కావాలి.
- జి సాంబశివరావు, అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ,
బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ (తెలంగాణ సర్కిల్)
ప్రజలు నష్టపోతారు
దేశంలో గతంలో కంటే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తున్నది. దీనివల్ల కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రధానంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వరంగ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైల్వే, రక్షణరంగం సహా అన్నింటినీ ప్రయివేటీకరిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘంలో అన్యాయం జరిగింది. 21 నెలలుగా డిఏ లేదు. కేంద్రప్రభుత్వం యజమానిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ దశలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు సంఘటితంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వరంగాన్ని కాపాడుకోలగలుగుతాం. ఆ దిశగా మేం ప్రజల్ని సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కోవిడ్-19 కారణంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టలేకపోతున్నాం. దీన్ని ఆసరా చేసుకొనే కేంద్రప్రభుత్వం తన ప్రయివేటీకరణ విధాన నిర్ణయాల అమలును వేగవంతం చేస్తున్నది. అనేక ఒత్తిళ్లు, ఆందోళనలు, భయాలు, అభద్రతల మధ్య ఈ ఏడాది మే డే వేడుకలు జరుపుకుంటున్నాం.
- వి నాగేశ్వరరావు, అధ్యక్షులు, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖలు)
దేశాన్ని కార్పొరేట్ భారతావనిగా మార్చే కుట్ర
135వ మేడే సందర్భంగా కార్మికవర్గానికి పోరాట అభినందనలు. పరిశ్రమలు, కార్మికవాడల్లో జనసమీకరణ లేకుండా జెండాలు ఎగురవేసి మేడే స్ఫూర్తిని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సెకండ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉందని మేధావులు మొత్తుకున్నా ప్రధాని మోడీ పట్టించుకోలేదు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యమన్నట్టుగా కరోనా నిబంధనలను ప్రధాని స్థాయిలో ఉండి కూడా తుంగలో తొక్కిన ఆయనను శిక్షించాలి. పన్ను చెల్లింపు పరిధిలోకి రాని కార్మికులందరికీ రూ.7,500 చొప్పున చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటాన్ని చూస్తేనే ఆ పార్టీకి కార్మికుల పట్ల ఉన్న వ్యతిరేకతేంటో అర్థమవుతున్నది. సెకండ్‌వేవ్‌లోనూ వలస కార్మికులకు పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించకుండా మోడీ, నిర్మలాసీతారామన్ మోసం చేశారు. చట్టాలను మార్పుచేసి కార్మికులను బానిసలుగా మార్చి దేశంలోని పరిపాలనేతర వ్యవహారాలన్నీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్ర జరుగుతున్నది. స్వాతంత్య్ర భారతావనిని కార్పొరేట్ భారతావనిగా మార్చడమే మోడీ ధ్యేయం. 130 కోట్ల మంది కరోనాతో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే విజయవాడ రైల్వేస్టేషన్ నిర్వహణను 99 ఏండ్లకుగానూ ప్రయివేటుకు అప్పగించడం మూర్ఖత్వమే. భవిష్యత్‌లో కార్మికులు, రైతులు సమైఖ్య పోరాటాలతో మోడీ విధానాలను కచ్చితంగా ఓడిస్తారు.
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్
ప్రయివేటీకరణతో రాజ్యాంగ హక్కులకు తూట్లు
గతంలో అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి తదితర నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు మోడీ సర్కారు... భారతదేశాన్ని మొత్తానికి మొత్తంగా గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో గతంలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నది. మరోవైపు దేశభక్తి జపం చేస్తున్న మోడీ సర్కారు... ప్రభుత్వరంగ సంస్థలను శరవేగంగా ప్రయివేటీకరిస్తున్నది. దీంతో సంఘటితరంగం నానాటికీ తగ్గిపోయి... అసంఘటితరంగం పెరుగుతుంది. ఫలితంగా కార్మికుల ఐక్యతకు తీరని విఘాతం కలుగుతుంది. మరోవైపు ప్రభుత్వరంగం ధ్వంసమైతే... రాజ్యాంగంం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు, సంబంధిత హక్కులూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి.
కార్మికులు తీవ్రమైన శ్రమదోపిడీకి గురవుతారు. ఈ నేపథ్యంలో కార్మికవర్గం తమ హక్కుల సాధన కోసం మరోసారి సంఘటిత పోరాటాలకు ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. మేడే సందర్భంగా యావత్ కార్మికవర్గానికి శుభాకాంక్షలు. ఇదే సమయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కొద్ది మంది మాత్రమే హాజరై జెండా ఆవిష్కరణలు చేయాలి. తద్వారా ప్రస్తుత క్లిష్ట సమయంలోనూ మేడే స్ఫూర్తిని కొనసాగించండి.
- టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు
అందరికీ ఉచిత టీకాలివ్వాలి..కార్మికులకు రూ.7,500 ఇవ్వాలి..
అంతర్జాతీయ కార్మిక పోరాట దినం సందర్భంగా కార్మికలోకానికి శ్రామికులందరికీ శుభాకాంక్షలు. కోవిడ్-19 సెకండ్‌వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ వికేంద్రీకరణ పద్ధతుల్లో వేలాది గ్రామాల్లో, పరిశ్రమల్లో మేడే ఉత్సవాలను నిర్వహించాలని కోరుతున్నాం. పనిప్రదేశాల్లోనే కాకుండా నివాస ప్రాంతాలు, ఇండ్లలోనూ అరుణపతాకాన్ని ఎగురవేసి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచి 135 కోట్ల జనాభాను కాపాడటానికి సార్వజనిక వ్యాక్సిన్ పథకాన్ని కాలపరిమితితో ముగించాలి. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలి. దేశ జనాభాకు అనేక రెట్లు టీకాలను ఉత్పత్తి చేయాలి. వ్యాక్సిన్ల ధర ఇష్టమొచ్చినట్టు నిర్ణయించడం సరిగాదు. ఆర్థిక రథచక్రాలను నడుపుతున్న కార్మికులను, కరోనా నియంత్రణలో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రూ.50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కోట్లాదిమంది నిరుపేదలకు, అసంఘటిత కార్మికులకు రూ.7500, ప్రతి వ్యక్తికి పదికేజీల బియ్యం/గోధుములు ఇవ్వాలని కోరుతున్నాం. ఆరునెలల పాటు అందించాలి.
లేబర్ కోడ్లను, నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే మోడీ సర్కారు రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను చర్యలన్నింటినీ ఉపసంహరించుకోవాలి. పోరాటాల్లో రైతులను, వ్యవసాయ కూలీలను కలుపుకుని ఐక్యంగా ముందుకుసాగాలని కార్మికులకు పిలుపునిస్తున్నాం.
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
బ్యాంకుల ప్రయివేటీకరణతో సామాన్యులకు నష్టం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకం, 2021-22 బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టుగా బ్యాంకింగ్ రంగం ప్రయివేటీకరణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూనుకుంటున్నది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్య ప్రజానీకానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలకే మేలు కలుగుతుంది. అమెరికా సహా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ తట్టుకుని నిలబడిందంటే ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉండడమే ప్రధాన కారణం. ఇవన్నీ తెలిసినా మోడీ ప్రభుత్వం బ్యాంకులను ప్రయివేటీకరించడం లేదంటే విలీనం చేస్తున్నది. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ తర్వాత సామాన్య ప్రజలకు చేరువగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సమాజంలో అట్టడుగు వర్గాల వారితోపాటు వ్యవసాయ రంగానికి, రైతులకు రుణాలు ఇవ్వడం సాధ్యపడింది. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ శాఖలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలతో బ్యాంకింగ్ సేవలు ప్రజలకు దూరమవుతాయి. దేశ ఆర్థిక వనరుల మీద కార్పొరేట్ సంస్థలు, విదేశీ బ్యాంకుల పెత్తనం మొదలవుతుంది. ప్రజలకు, రైతులకు రుణాలు దొరికే అవకాశాలు సన్నగిల్లు తాయి. ప్రయివేటు బ్యాంకులు లాభాలు వస్తేనే పెట్టుబడి పెడతాయి. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆ బ్యాంకుల శాఖలుండవు. దీంతో ప్రజలు ముఖ్యంగా సామాన్యులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రజలందరూ ఐక్యంగా ప్రతిఘటించాలి.
- బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య
కార్మికులకు చీకటి రోజలొచ్చాయి
కార్మికులకు చీకటి రోజలొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చింది. యాజమానులకు అనుకూలంగా ఇవి ఉన్నాయి. ఆర్టీసీలో వేతన సవరణ జరగలేదు. వేధింపులు, అరాచకాలు కొనసాగుతున్నాయి. యూనియన్లు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నది. అసంఘటిత రంగ కార్మికులకు నాడు కాంగ్రెస్, నేడు టీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నాయి. 13 ఏండ్లుగా అసంఘటిత కార్మికులకు వేతన సవరణ జరగలేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ కార్మికులకు మాత్రం జీతాలు పెరగలేదు. అందువల్ల వారు తిరుగబాటు చేయాల్సి అవసరం ఉన్నది. అసంఘటిత కార్మికులకు కరువు భత్యం రావాంటూ ఎన్టీఆర్ హయాంలో అమరనిరాహరదీక్ష చేసి సాధించాను. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు రాలేదు. బీఎస్ఎన్ఎల్లో 88 లక్షల మందిని వీఆర్ఎస్ పేరుతో బీజేపీ బయటకు పంపింది. బీజేపీ తరహాలోనే టీఆర్ఎస్ పరిపాలన కొనసాగుతున్నది. మూడేండ్లుగా ఫిట్మెంట్ అమలు చేయలేదు. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు కార్మికులను మోసం చేసింది. కార్మికులు చట్టాన్ని నమ్ముకుని నిరంతరం పోరాటం చేయాలి. జాతీయ స్థాయిలో కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి.
- ఎంకె బోస్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
కార్మికులు బానిసలే...హక్కులు ఉండవు
కార్మికులకు ఇది 136వ మేడే. 200 ఏండ్ల కిందట దేశంలో శ్రామిక ఉద్యమం ప్రారంభమైంది. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. నాలుగు కోడ్లను తీసుకొచ్చింది. 1890కు ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో, మళ్లీ ఇప్పుడు అదే దుస్థితి ఉన్నది. కార్మికుడు బట్టలేసుకుని బయటకు వెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, టూవీలర్ బైక్, టీవీ ఉన్నప్పటికీ ఇప్పటికీ పని ప్రదేశాల్లో మాత్రం బానిసగానే బతుకుతున్నాడు. దీని నుంచి కార్మికులు బయటకు రావాలి. సంఘటితమవ్వాలి. అసంఘటిత కార్మికులు, ఐటీ, ఓలా, స్విగ్టీ కంపెనీలలో పని చేసే కార్మికులు కార్మిక సంఘాల్లోకి రావాల్సి అవసరం ఉంది. తద్వారా వారి హక్కులను కాపాడుకోవాలి. వారికి సహకరించేందుకు సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.
కార్మికుల హక్కులను కాపాడేందుకు అన్ని కేంద్ర కార్మికు సంఘాలు కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్రాలు, లేఖ రాశాయి. జైల్‌భరో నిర్వహించి, ఎంతో మంది కార్మికనేతలు అరెస్టులు అయ్యారు. ఇప్పటికి ఐదు సార్వత్రిక సమ్మెలు నిర్వహించాం. ప్రభుత్వం మొండివైఖరితో ఉన్నది. కుల, మత సంఘాలపై బీజేపీ మక్కువ చూపిస్తున్నది. కార్మిక సంఘాలను పట్టించుకోవడం లేదు. కార్మిక సంఘాలు, యాజమన్యాలు, ప్రభుత్వం కూర్చుని మాట్లాడుకుని చట్టాలు చేయాలి. రాష్ట్రంలో అసంఘటిత కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేసినప్పటికీ అనుభవం లేని వారిని ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. అసంఘటిత కార్మికులకు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యలపై అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యమాలు ఉధృతం చేస్తాం.
- ఆర్డీ చంద్రశేఖర్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి
మరిన్ని పోరాటాలకు కార్మికులు సన్నద్ధం కావాలి
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని... కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 12-14 గంటల విధానంగా మార్చేందుకు పూనుకున్నది. పోరాడి సాధించుకున్న హక్కులతోపాటు వాటి అమలుకు తిరిగి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. మోడీ ప్రభుత్వం మహిళా కార్మికులతో అర్థరాత్రి వరకు పనిచేయించేందుకు చట్టం తీసుకురావడం అత్యంత హేయమైనది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక అత్యాచారాలు, హత్యలు విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వం మహిళలతో రాత్రి వేళల్లో పనిచేయించేందుకు ప్రయత్నించటమేంటి...? దేశంలో మహిళా కార్మికుల భధ్రతకంటే కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ విధానమా? ఈ విధానాలను కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. మరిన్ని పోరాటాలకు సిద్దం కావాలి.
- ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ
ప్రభుత్వరంగ బ్యాంకులతోనే ప్రజలకు మేలు
మోడీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. 1969లో బ్యాంకుల జాతీయీకరణను ఇందిరాగాంధీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినపుడు అప్పుడు వ్యతిరేకించిన వారి వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు అనేక మందికి రుణసహాయం చేస్తున్నాయి. ఆర్థికంగా నిమ్నవర్గాలకు తోడ్పాటునందిస్తున్నాయి. అయినా బ్యాంకింగ్‌రంగాన్ని వీలైనంత తొందరగా ప్రయివేటీకరించాలని మోడీ సర్కారు భావిస్తున్నది. ఇది తప్పుడు విధానం. భారతదేశంలో ఉన్నట్టుగా ఆర్థిక అసమానతలు ఇతర దేశాల్లో ఉండవు. దేశంలో పేదరికం తీవ్రంగా ఉన్నది. అదే సమయంలో కుబేరులూ ఉన్నారు. సుమారు 50 కోట్ల మంది మూడుపూటలా తిండిదొరకని వారు ఈ దేశంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్నారు. సామాన్యులకు, అట్టడుగువర్గాల ప్రజలకు ఆర్థికంగా సహాయం చేయాలంటే, రుణాలు ఇవ్వాలంటే ప్రభుత్వరంగ బ్యాంకులతోనే అది సాధ్యమవుతుంది. ప్రయివేటు బ్యాంకులు ప్రజల గురించి ముఖ్యంగా పేదల సంక్షేమాన్ని పట్టించుకోవు. రుణ సహాయం చేసేందుకు ముందుకురావు. లాభాలే వాటి లక్ష్యం. కానీ ప్రభుత్వరంగ బ్యాంకులకు లాభాలు ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ తేడాను అందరూ గమనించాలి. ఆ ఉద్దేశంతోనే 1969లో 20 బ్యాంకులను జాతీయం చేశారు. కానీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పనిసరిగా దేశానికి చేటు కలిగిస్తాయి. ఎంత తొందరగా ఈ సర్కారు గద్దెదిగితే భారత దేశానికి, ప్రజలకు అంత మేలు కలుగుతుంది.
- ఏఐబీఈఏ కార్యదర్శి బిఎస్ రాంబాబు
ఎల్ఐసీని దెబ్బకొట్టేందుకే ప్రయివేటీకరణ
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలను ప్రయివేటీకరించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే మొదటి అడుగు కింద ఎల్ఐసీ, ఇన్సూరెన్స్ సంస్థల్లో పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నది. ప్రపంచంలోనే ఎల్ఐసీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. దేశంలో విద్యుత్, రోడ్లు, చమురు, రైల్వే వంటి ఏ రంగంలో ప్రాజెక్టులు నిర్మించాలన్నా ఎల్ఐసీ ఆర్థిక సహకారం ఉంటున్నది. 20 శాతం పెట్టుబడిని సమకూరుస్తున్నది. ఎల్ఐసీని ఎందుకు ప్రయివేటీకరణ చేయాలన్న ప్రశ్న అందరిలోనూ వస్తున్నది. గతంలో నష్టాలొచ్చే సంస్థలను ప్రయివేటీకరించే విధానం ప్రభుత్వం అనుసరించేది. కానీ వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదని పాలకులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తామంటున్నారు. ప్రయివేటురంగంలో ఇన్సూరెన్స్ సంస్థలు వచ్చాయి. ఎల్ఐసీ మునిగిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు. 23 ప్రయివేటు ఇన్సూరెన్స్ సంస్థల మార్కెట్ షేర్ 24 శాతం మాత్రమే ఉన్నది. ఎల్ఐసీ వాటా 76 శాతం ఉంది. అందుకే ఎల్ఐసీని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులను ఉపసంహరించి ఆ తర్వాత ప్రయివేటుపరం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వరంగం అంటేనే సేవారంగం. లాభాలు, నష్టాలు చూడొద్దు. ప్రభుత్వరంగ సంస్థలను విచ్ఛిన్నం చేసే కుట్ర కేంద్రం చేస్తున్నది. దేశంలో ఎల్ఐసీకి 40 కోట్ల పాలసీదారులున్నారు. మా సంస్థ వల్ల మోసపోయామని ప్రజల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణల్లేవు. ఎల్ఐసీని కాపాడుకోవడం ఉద్యోగుల బాధ్యత. పాలసీదారులకు నష్టం కలగకుండా చూస్తాం. మోడీ ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు ఆ తర్వాత ఉండకపోవచ్చు. కానీ ఎల్ఐసీ ఎప్పుడూ ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలంది స్తుంది. మూర్ఖులు అధికారంలో ఉన్నారు. ప్రజల చేతిలో ఓటు ఆయుధం ఉన్నది. ప్రభుత్వరంగాన్ని ప్రయివేటుపరం చేస్తున్న అధికార పార్టీని గద్దెదించాలి. రానున్న కాలంలో ప్రజలను చైతన్యం చేస్తాం. మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేంగా కోవిడ్ తగ్గిన తర్వాత ఐక్యంగా ఉద్యమాలు నిర్మిస్తాం.
- ఏఐఐఈఏ అధ్యక్షులు రమేష్
కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనాను ఆసరా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజాహక్కులపైన నిర్భందాన్ని ప్రయోగిస్తున్నది. అందులో భాగంగానే మూడు నూతన రైతు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు దారి సుగుమం చేసింది. దీంతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినబోతున్నది. తద్వారా రైతాంగం దివాళా తీస్తుంది. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర పన్నింది. దీంతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరగబోతున్నది. ఈ సమయంలో సమస్త ప్రజానీకం, కార్మికవర్గమంతా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముంది. మేడే సందర్భంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలనీ, అందుకు ప్రతినబూనాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.
- ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం