Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా?
- కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
- ధరల నిర్ణయం ఔషధ కంపెనీలకు వదిలేయరాదని సూచన
- వ్యాక్సినేషన్లో ప్రయివేటు విధానం ఉండరాదని వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వందశాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగింది. కేంద్రం సేకరించే వ్యాక్సిన్లకు రూ.150, రాష్ట్రాలు సేకరించేవాటికి రూ.300, రూ.400..వివిధ ధరలు ఎందుకు ఏర్పడ్డాయని ప్రశ్నించింది. వ్యాక్సిన్ల ధర నిర్ణయం ఔషధ తయారీ కంపెనీలకు వదిలేయటం సరైంది కాదని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభం..నిర్వహణ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సుప్రీం వ్యక్తం చేసిన సందేహాలు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాల్సిందిగా తుషార్ మెహతా కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేరు వేరుగా రెండేసి టీకా ధరలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించింది.
దేశంలో 18-45 ఏండ్ల మధ్య వయస్కులు దాదాపు 59కోట్లమంది ఉన్నారు. వాక్సినేషన్ చేయించుకోవడానికి పేదలు, అణగారిన వర్గాల వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి ప్రయివేటురంగ విధానం ఉండకూడదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనం
అమలు చేస్తున్న జాతీయ రోగ నిరోధక విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి. నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా? మరి అలాంటివారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తున్నారు? స్మశానవాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారు? నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదు? 18-44 ఏండ్ల మధ్య జనాభా ఎంత? వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత?
పేటెంట్ చట్టం అమలు చేస్తున్నారా?
'' ఆక్సీజన్ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని హాస్పిటల్స్‌కు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత వరకు సరఫరా చేస్తున్నారు? లాక్డౌన్ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలు ఏవి? పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను కేంద్రం అమలుచేస్తోందా? వ్యాక్సిన్ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? '' అంటూ ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమి స్తున్నారు? హాస్పిటల్ బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఎలా ఏర్పాటుచేస్తున్నారని అడిగింది.
ప్రజల గళాన్ని విందాం.. సామాజిక మాధ్యమంలో
సాయం కోరేవారిపై చర్యలు వద్దు : సుప్రీం
కరోనా మహమ్మారి విపత్తు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో లేదా ఇతర విధాలుగా సాయం కోరేవారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది. మనదేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70ఏండ్లనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలనుకానీ విమర్శించడానికి కాదని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పస్టం చేసింది. సాధారణ పౌరుడిగా, న్యాయమూర్తిగా ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటే, ఆ సమాచారాన్ని తొక్కిపెట్టాలని తాము కోరుకోవటం లేదన్నారు. ప్రజల గళాలను విందామన్నారు. హాస్పిటల్లో బెడ్, ఆక్సీజన్ కోరిన వ్యక్తులను హింసించరాదని, అలా జరిగితే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని
లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో వేవ్ సృష్టిస్తున్న పెను విపత్తుపై ప్రధాని మోడీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టే యోచన కేంద్రానికి లేదని కేంద్రమంత్రులతో, ఉన్నతాధికారులతో అన్నారని వార్తలు వెలువడ్డాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తున్న సమస్యలు, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న, తీసుకోవల్సిన చర్యలపై సమావేశం చర్చించింది.
బీజేపీ ఎంపీకి 10వేల రెమ్‌డెసివర్ వయల్స్
ఎలా సేకరించాడో విచారణ చేయండి: బాంబే హైకోర్టు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఎంపీ సుజరు విఖీ పాటిల్ (బీజేపీ) అత్యంత రహస్యంగా, అనధికారికంగా రెమ్‌డెసివర్ ఔషధాల్ని పెద్దమొత్తంలో ఎలా సేకరించాడు?..దీనిపై వెంటనే విచారణ చేయండంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి..మే 3లోగా నివేదిక సమర్పించాలని అహ్మద్‌నగర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది. కరోనాబారిన పడి ఆరోగ్యం విషమపరిస్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే రెమ్‌డెసివర్ ఔషధాన్ని ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మరణాలను తగ్గించగలిగే అత్యంత కీలక ఔషధానికి సంబంధించి సేకరణ, పంపిణీ అంతా కేంద్రమే చూస్తోంది. ప్రయివేటు వ్యక్తులుగానీ, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వీటిని ఇష్టానుసారం సేకరించడానికి వీల్లేదు. అలాంటిది..ఎంపీ సుజరు విఖీ పాటిల్ 10వేల రెమిడెసివర్ వయల్స్ న్యూఢిల్లీ నుంచి సేకరించాడని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఘటనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన నియోజికవర్గంలోని కొంతమంది రోగులను కాపాడే ఉద్దేశంతో ఔషధాల్ని న్యూఢిల్లీ నుంచి తెప్పించానని ఎంపీ తన చర్యను సమర్థించుకుంటున్నాడు. నిందితుడి వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎంపీ చర్యను సమర్థించలేమని ధర్మాసనం పేర్కొంది. '' ఎంపీ విఖీ పాటిల్ చేతికి ఇంత పెద్ద సంఖ్యలో రెమ్‌డెసివర్ ఔషధాలు వచ్చాయన్నదానిపై విచారణ చేయాలి. రహస్యంగా, అనధికారికంగా ఔషధాలు సేకరించాడు. దీనిని ఎంతమాత్రమూ ఆమోదించరాదు. దీనిని సమర్థిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి'' అని జస్టిస్ రవీంద్ర గాగే అన్నారు.