Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టైమ్స్ నౌకు చెందిన పూర్వ, ప్రస్తుత ఉద్యోగులమైన మేము, ఈ విధంగా ఛానల్ ఎడిటర్లకు, జర్నలిజం మౌలిక విలువలు, నైతికతల గురించి గుర్తు చేయడానికి, ఒక బహిరంగ లేఖ రాయాల్సిన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదు! మా చుట్టూరా బహిర్గతమవుతోన్న పరిణామాలను చూస్తుంటే, మా భ్రమలు తొలగిపోతూ, తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి, అలసటకు గురవుతూ, ఎన్నడూలేని నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోతున్నాం. జర్నలిస్టులుగా మాకు ఒకటే నేర్పించారు. ఎల్లప్పుడూ ప్రజలపక్షాన నిలబడమని! మానవత్వంపక్షాన నిలబడమని! బలవంతులను వారి చర్యలకు వారు బాధ్యత వహించాలని నిలదీయమని! కానీ జర్నలిజం ముసుగులో నేడు 'టైమ్స్ నౌ' ఏమి చేస్తోందంటే, ఈ దేశ ప్రజలను అన్ని రంగాల్లో దారుణంగా వంచించిన ప్రభుత్వానికి కొమ్ముగాస్తు, పౌర సంబంధాల (పబ్లిక్ రిలేషన్)పాత్ర పోషిస్తోంది తప్ప మరొకటి కాదు. మేము ఈ లెటర్ రాస్తున్న సమయంలోనే, కోవిద్-19 పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం ప్రదర్శించిన అసమర్ధత వల్ల, మా సహౌద్యోగులు కొందరు, వారి కుటుంబాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు.
జర్నలిస్టులుగా మా చుట్టూరా ఏమి జరుగుతోందనే విషయంలో మాకు పూర్తి సమాచారం వుంది. ఒక హాస్పిటల్లో బెడ్‌కోసం ప్రజలు అంబులెన్సులోనో లేక వీధుల్లోనో వేచి చూస్తున్నారు. దానికన్నా ఘోరం ఏమిటంటే విషమ పరిస్థితిలో వున్న పేషెంట్లు, ఆక్సిజన్ సౌకర్యం అందడం కోసం ఊపిరాడక విలవిలలాడి పోతున్నారు. ఆ ఎదురుచూపులోనే కొందరు మరణిస్తున్నారు. ప్రాణావసర మందులు దొరకడం లేదు. ఈ ప్రభుత్వం కన్నా, కొందరు మానవతా మూర్తులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించి ఇప్పించడం ఎక్కువగా కనపడుతోంది. మన దేశ రాజధానిలోని ఒక ప్రముఖ ఆస్పత్రి తన పేషెంట్స్‌ను బతికించుకోవడం కోసం, ప్రభుత్వం నుంచి ఆక్సిజన్ సిలిండర్లను ఇప్పించమని హైకోర్టును ఆశ్రయించడం చూసాం. అధికారులకు ఆక్సిజన్ కొరత గురించి తెలియ చేయడానికి, ట్వీట్ల ద్వారా ఆస్పత్రులు వేడుకోవడం చూస్తున్నాం. రాష్ట్రాలు 'ఆక్సిజన్ నిలువలు'మాదంటే మాదని తగాదా పడటం చూస్తున్నాం. ఈ రోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామనేది వాస్తవం!
మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. దాని గురించి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇదొక అత్యయిక ఆరోగ్య పరిస్థితి మాత్రమే కాదు! మన కళ్ళ ముందు ఒక మానవీయ సంక్షోభం బహిర్గతమవుతోంది! శక్తివంతమైనదిగా ప్రసిద్ధిగాంచిన 'టైమ్స్ నౌ' జర్నలిస్టులుగా మనం ఈ దేశ ప్రజలకోసం ఏమి చేస్తున్నాం?
మనం ఇప్పటికి ప్రతిపక్షాన్నే నిందిస్తున్నాం. వాస్తవ విషయాల నుంచి దష్టిని మళ్లిస్తున్నాం. మతతత్వ కోణంలో హిందూ-ముస్లిం కథనాలను చర్చిస్తున్నాం. ప్రభుత్వానికి అనుకూలంగా లేని ప్రతి కథనాలను డొంకతిరుగుడుగా మారుస్తున్నాం. ఈ అసమర్ధ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు, మనం సంపూర్ణ మౌనాన్ని ప్రదర్శిస్తున్నాం! ఈ రోజు మనమంతా దిగబడి పోయిన దుస్థితి గురించి నరేంద్ర మోడీని పేరెత్తి విమర్శించడానికి కూడా మనకు ధైర్యం సరిపోవడం లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కోవిద్-19 నిబంధనలు ఉల్లంఘించి భారీ రాలీలు నిర్వహిస్తోన్న ప్రతిపక్షాలను చుపిస్తున్నాం. కానీ, అమిత్ షా ఫోటో కూడా చూపించడానికి ఒప్పుకోవడం లేదు. అంతగా వెన్నెముక లేకుండా తయారయ్యాము.
యూపీఏ హయాంలో 'విధాన పరమైన అచేతనావస్థ' ఏర్పడిందని మీరు ఎంతగా గగ్గోలు పెట్టేవారో ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి? యావత్ వ్యవస్థనే కుప్పకూలిన నేటి స్థితిలో మనం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నించామా!?
కోవిద్-19ను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి 'టైమ్స్ నౌ' ఎడిటర్లు సిద్ధపడడం లేదని స్పష్టంగా కనపడుతోంది. దేశం నలుమూలలా వేలాది మంది భారతీయులు మరణిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రశ్నలు సంధించి, క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను వెలికితీయాలని మననుండి కనీసంగా ఆశిస్తుంటారు. దానిబదులు మనం సులభంగా ఎవరినైనా దోషులుగా నిలబెట్టడానికో, లేదా బీజేపీయేతర రాష్ట్ర ప్రభత్వాలు, నాయకులనో ఎంపిక చేసుకుని చుపిస్తున్నాం. ఆ విధంగా బీజేపీ ఐటీ సెల్ అజెండాను అమలు పరుస్తున్నాం
ప్రజలు బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి వినియోగించాల్సిన విలువైన ప్రసార సమయాన్ని, బీజేపీ అజెండాకు సరిపోయే విధంగా రైతులను లక్ష్యంగా చేసుకుంటున్నాం. వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి మీడియా ఏ విధంగా పనిచేస్తోందనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటి ఉండదు.
ప్రధాన మంత్రి మోడీ పరిపాలనా వైఫల్యాన్ని, నిర్దాక్షిణ్యమైన వైఖరిని ప్రశ్నించే బదులు 'టైమ్స్ నౌ' ఎడిటర్లు ఆయనకు చెడ్డ పేరు రాకుండా, ఆయన ప్రతిష్టను కాపాడడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
బీజేపీ ఐటీ సెల్ సభ్యులు పంపించే సందేశాలను మన ఛానెల్ స్వీకరించి, కాపీ చేసి, పేస్ట్ చేయడం, వాటి ఆధారంగా ప్రధాన సమయంలో చర్చలకు పెట్టి, దేశానికి ఒక కొత్త అజెండా నివ్వడాన్ని చూసి వేదన చెందుతున్నాం. మన ఛానెల్ ఎడిటర్లకు, రిపోర్టర్లకన్నా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తు, షెహజాద్ పూనావాలా లాంటి ఒక ద్రోహి, ప్రభుత్వ పైరవీకారు, ఇంటర్ నెట్ వేధింపుల నిపుణుడు పోస్ట్ చేసే సందేశాలను ప్రధాన కథనాలుగా ప్రసారం చేస్తున్నారు.
మనల్ని మనం ఏ స్థాయికి దిగజార్చుకున్నాం!? మూగగా రోదించే ప్రజలగురించి అనునిత్యం మాట్లాడే మన ఛానల్, ఈ రోజు ప్రభుత్వ బాకాగా పూర్తి స్థాయిలో మారిపోయింది. దేశమే మా మొదటి ప్రాధాన్యతని ప్రకటించుకునే ఛానల్, నేడు ఈ దేశ ప్రజల బాధలను పట్టించుకోవడమే మానేసింది.
మీరు ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడుతారు? బీజేపీ అజెండా కోసం పనిచేయమని మీ ఎడిటోరియల్ బందం మొత్తాన్ని ఒత్తిడి చేయడం ఎప్పుడు మానుతారు? ప్రభుత్వం బాధ్యత వహించాలని మీరు గుర్తించి నిలదీయడానికి, మీకు ఇంకా ఎన్ని మృతదేహాలు కనపడాలి? మీరు పొందుతున్న ప్రత్యేక సౌకర్యాలు మీ కండ్లను కప్పేయడం వల్ల, క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతోన్న బాధలు మీకు కనపడడం లేదా!? మీ చేతులు ఇంకెంత రక్త సిక్తం కావాల్సి వుంది?
గౌరవ నీయులయిన ఎడిటర్లు : ''మానవత్వం వైపు నిలబడుతారా లేక బీజేపీ వైపు నిలబడతారా'' అనే వాటిలో ఎదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వుంది. మీరు కనుక రెండవదే ఎంచుకునేటట్లయితే మీరు ఈ వత్తికే కాక, దేశానికి ప్రజలకు ద్రోహం చేసిన వారవుతారు.
ఇతర జాతీయ ఛానెళ్లలో వున్న సహౌద్యోగులు కూడా నేటి తరుణంలో బయటకు వచ్చి స్పందించాల్సిన అవసరం వుంది. ఇప్పుడా పని చేయకపోతే చరిత్ర మనలను ఎన్నటికీ క్షమించదు!
ఇట్లు
పూర్వ, ప్రస్తుత 'టైమ్స్ నౌ' ఛానెల్ ఉద్యోగులు
(స్వేచ్చానువాదం:సత్యభాస్కర్)
గౌరవనీయులైన ఇతర మీడియా ఛానెల్స్‌కు,
మన దేశాన్ని కాపాడుకోవటం కోసం మీ గళాన్ని వినిపించండి. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీతోనూ, లక్షలాది అమాయకుల కరోనా మరణాలతోను తల్లడిల్లి పోతోంది.
అంతేకాదు.. మన దేశం బీజేపీ దాని గురువు ఆర్ఎస్ఎస్ల కుట్రల ఫలితంగా మతతత్వ విభజనకు గురవుతున్నది. నిరుద్యోగం పెచ్చుమీరి పోతోంది. విద్య, వైద్యాల కార్పొరేటీకరణ, ఇన్సూరెన్సు, ఆర్బీఐ తదితర బాంకింగ్ పరిశ్రమల నియంత్రణ, ఎన్నడూ వినని రీతిలో రక్షణ రంగంతో సహా రైల్వేలు, టెలికాం, పబ్లిక్ సెక్టార్ల ప్రయివేటీకరణ సాగుతోంది.
ఈ ఆర్ఎస్ఎస్ ఆక్టోపస్ బారి నుంచి ఈ దేశాన్ని, 130 కోట్ల ప్రజానీకాన్ని రక్షించమని రెండు చేతులా జోడించి అర్ధిస్తున్నాను. భారత ప్రజానీకానికి కావలసిన నైతిక బలాన్ని ఇవ్వమని కోరుతున్నాను. బహుళ భాషలు, మతాలు, సంస్కతులున్న మనమంతా ఒక్కటే అని తెలియజేస్తున్నాను.
ఇట్లు
టైమ్స్ నౌకు చెందిన పూర్వ, ప్రస్తుత ఉద్యోగులు