Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌంశాఖ సూచన
- పలు రాష్ట్రాల్లో కఠినంగా..
న్యూఢిల్లీ: కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హౌం శాఖ సూచించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు, గత వారం రోజుల్లో 60 శాతానికిపైగా పడకల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో కొత్త కంటైన్మెంట్ ఆంక్షలను అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
హర్యానాలో తొమ్మిది జిల్లాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం 5 వరకూ లాక్డౌన్ కొనసాగుతుంది.
పశ్చిమ బెంగాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్యూటీపార్లర్లు, జిమ్స్, స్పాస్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బజార్లు, మార్కెట్ ప్లేస్‌లలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 3 నుంచి 5 వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.
కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కిన ఏబీవీపీ కార్యకర్తలు
ఉత్తరాఖండ్‌లోని డూన్ మెడికల్ కళాశాల కోవిడ్ వార్డులో నిబంధనలను తుంగలో తొక్కి ఏబీవీపీ కార్యకర్తలు చేసిన హంగామా చర్చనీయాంశమైంది. ఏబీవీపీ స్టిక్కర్లను అంటించుకున్న పిపిఇ కిట్లను ధరించిన కార్యకర్తలు ఆసుపత్రి వార్డులో గురువారం ప్రవేశించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ పైపును తొలగించి, జ్యూస్ అందజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోవిడ్ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న వైద్యసిబ్బంది మినహా ఇతరులెవరూ ఆ వార్డుల్లోకి ప్రవేశించకూడదు. డూన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అశుతోష్ సయానా మాట్లాడుతూ, ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి సహాయం చేసేందుకు ఎబివిపి అనుమతి తీసు కుందని చెప్పారు. కోవిడ్ 19 వార్డులోకి ప్రవేశించేందుకు వారికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
భారత్ చేరిన అమెరికా సహాయం
అమెరికా అత్యవసర సాయంగా పంపించిన 400 ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మనదేశం చేరాయి. వీటితో అమెరికా సూపర్ గెలాక్సీ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 'కోవిడ్‌తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు భారత్‌కు చేరాయి' అని మనదేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది.
సహాయం అందిస్తాం.. : ప్రధాని మోడీకి జిన్‌పింగ్ సందేశం
ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్‌కు సహాయం, మద్దతు అందిస్తామని ప్రధాని మోడీకి చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ సందేశం పంపారు. గత ఏడాది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తిన తరువాత, కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత జిన్‌పింగ్ నుంచి ఇలాంటి సందేశం రావడం ఇదే మొదటిసారి. జిన్‌పింగ్ సందేశాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ద్వారా మోడీకి పంపారు. 'భారతదేశంలో తాజా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. చైనా ప్రభుత్వం, ప్రజల తరపున, అలాగే నా తరపున భారత ప్రభుత్వానికి, ప్రజలకు హదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను' అని సందేశంలో జిన్‌పింగ్ పేర్కొన్నారు. 'సంఘీభావం, సహకారం ద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దేశాలు మహమ్మారిని ఓడించగలవు. మహమ్మారిపై పోరాడడంలో భారత పక్షంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఈ అంశంలో మద్దతు, సహాయాన్ని అందించడానికి చైనా సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వ నాయకత్వంలో, భారత ప్రజలు మహమ్మారిపై విజయం సాధిస్తారని నేను నమ్ము తున్నాను' అని జిన్‌పింగ్ తెలిపారు. జిన్‌పింగ్ సందేశాన్ని భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ ట్వీట్ చేశారు.