Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 నుంచి అమలు చేయనున్న అమెరికా
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దేశాలు ఒకదాని తర్వాత మరొకటి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా ఆ జాబితాలో చేరింది. భారత్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు ఈనెల 4 నుంచి అమల్లోకి రానున్నాయి. కరోనా తీవ్రతతో పాటు ప్రమాదకర వైరస్ వేరియంట్ల కారణంగా ఈ మేరకు అమెరికా ప్రకటన చేసింది. '' సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచన మేరకు భారత్ నుంచి ప్రయాణాలపై యంత్రాంగం వెంటనే ఆంక్షలు విధించనున్నది. భారత్లో కరోనా అసాధారణ పరిస్థితులు, కొత్త రకం వేరియంట్ల సర్క్యులేటింగ్ దృష్ట్యా దీనిని అమలుపరచనున్నాం'' అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ ప్సాకీ తెలిపారు. అయితే, ఈ ప్రయాణ ఆంక్షలు అమెరికా పౌరులు, చట్టపరంగా శాశ్వత నివాసితులు, వారి భాగస్వాములు, చిన్నారులు, తల్లిదండ్రులు, 21 ఏండ్ల లోపుండే చట్టబద్ధమైన శాశ్వత నివాసితులకు వర్తించబోవని ప్సాకి చెప్పారు. అలాగే, హ్యుమనిటేరియన్ వర్కర్స్కు కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. భారత్కు ప్రయాణాల విషయంలో తమ పౌరులను యూఎస్ గతనెల 19నే హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, భారత్ నుంచి ప్రయాణాలపై బిడెన్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్లు విమర్శించారు.