Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
- కోవిడ్ నేపథ్యంలో ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తమిళనాడు, కేరళ, పుదు చ్చేరిల్లో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. అస్సాంలో
మార్చి 27నుంచి ఏప్రిల్ 6వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29వరకు 8దశల్లో పోలింగ్ జరిగింది. ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్లను కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు లోపలకు అనుమతించరాదని పేర్కొంది. కౌంటింగ్ ప్రారంభానికి 48గంటలు ముందుగా రాపిడ్ టెస్ట్ చేయించుకున్న రిపోర్టు లేదా లేదా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికెట్లు కానీ తప్పనిసరిగా వుండాలని పేర్కొంది. గెలుపొందిన అభ్యర్ధితోపాటు మరో ఇద్దరికన్నా ఎక్కువమంది వుండరాదు. విజయోత్సవాలను కూడా ఈసీ నిషేధించింది. రోడ్‌షోలు, వాహనాల ర్యాలీలను కూడా ఇసి నిషేధించింది. ఆదివారం సాయంత్రం 5గంటలకు తుది ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.