Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికే మోడల్ అంటున్న గుజరాత్లో ఆగని ప్రమాదాలు
- ఢిల్లీ, కర్నూలులో ఆక్సిజన్ అందక ఆగిన ఊపిరి
- మృతుల్లో ఓ వైద్యుడు, ఇద్దరు నర్సులు ొ ఇవి ప్రభుత్వహత్యలే : ప్రజాసంఘాలు
బరూచ్: గుజరాత్లో కోవిడ్ పేషెంట్లు సజీవ సమాధులైపోతున్నారు. దేశానికే మోడల్‌గా చెప్పుకునే గుజరాత్లో మరణమృదంగం మోగుతున్నది. తాజాగా బరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్ ఆస్పత్రిలో 18 మంది అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో 16 మంది రోగులు కాగా, మిగతా ఇద్దరు నర్సులు. అగ్నికీలల్లో కాలిబూడిదయ్యారు. ఇక ఢిల్లీలోని బత్రా ఆస్పత్రిపై ఢిల్లీ కోర్టులో ఆక్సిజన్ సరఫరాపై విచారణ జరుగుతున్నప్పుడే.. ఆక్సిజన్ అందక అదే వైద్యశాలలో ఒక వైద్యుడు సహా 12 మంది ఊపిరి ఆగిపోయింది. ఇక కర్నూలులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్ అమర్చకపోవటంతో.. నలుగురు పేషెంట్లు చనిపోయారు.
గుజరాత్...
గుజరాత్‌లోని బరూచ్‌లోని పటేల్ ఆస్పత్రిలో 50 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. శుక్రవారం రాత్రి ఎక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందో కానీ.. అమాంతంగా విస్తరించాయి. నాలుగో అంతస్థులో ఐసీయూ ఉన్నది. ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల వరకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పవర్‌కట్ కావటం.. చిమ్మచీకట్లో బెడ్లపై ఉన్న రోగులకు శ్వాస ఆడలేదు. సిబ్బంది అటు ఇటు ఉరుకులు పరుగులు తీశారు. మంటలు చుట్టుముట్టడా.. ఆస్పత్రి అంతా ఆర్తనాదాలతో మారుమోగింది. విషయం తెలిసిన వెంటనే 12 అగ్నిమాపక దళాలు, 40 అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపకసిబ్బంది రోగులను కాపాడే ప్రయత్నాలు చేస్తుండగానే.. చికిత్స పొందుతున్న వారి బంధువులు భారీసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఏడుపులూ రోదనలతో ఆ ప్రాంతంలో బీతావహ వాతావరణం నెలకొన్నది. ఈలోపు సురక్షితంగా బయటకు తీసిన వారిని దగ్గర్లో ఉన్న సివిల్ ఆస్పత్రి, సేవాశ్రం దవాఖానా, జంబుసర్ అల్ మెహమూద్ హాస్పిటల్స్‌కు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యవర్గాలు తెలిపాయి.
అయితే షార్ట్‌సర్క్యూట్ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కోవిడ్ పేషెంట్లు చనిపోయారనీ, ఇవి ప్రభుత్వహత్యలేనని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకు ముందు కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు
నవంబర్ 27..2020
గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగటంతో.. ఐదుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదానికి కారణమని తేల్చారు. ఆ రాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించినా ఇప్పటికీ నివేదికలు సమర్పించలేదు.
ఆగస్టు 6 2020
అహ్మదాబాద్‌లోని శ్రే కోవిడ్ ఆస్పత్రిలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది రోగులు మరణించారు. వీరిలో 5 మంది పురుషులు, 3 మంది మహిళలు ఉన్నారు.
బీజేపీ నేతలకు చెందిన వెంటిలేటర్లలోనే షార్ట్ సర్క్యూట్ వల్ల గుజరాత్ మొదలుకుని దేశంలోని పలు కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయనీ గుర్తించినా..ఇంతవరకూ సరైన కోణంలో దర్యాప్తు జరగటంలేదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ..
మా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతలేదని ఢిల్లీ హైకోర్టులో బాత్రా హాస్పిటల్ వాదనలు వినిపిస్తుండగా..శనివారం మరో 12 మందికి ఆక్సిజన్ అందక గుండె ఆగిపోయింది. వీరిలో ఇదే ఆస్పత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ ఆర్కే హింథనీ కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయ్యారు.
కోర్టులో బాత్రా తరఫున తమ వాదనలు వినిపిస్తూ.. కేవలం ఒక్క గంటకు సరిపడా ఆక్సిజన్ మిగిలిఉన్నది. ప్రతిరోజూ గంటలకొద్దీ ఆక్సిజన్‌కోసం ఎదురూచూడాల్సివస్తున్నదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఎలాగైనా 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి అందజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే.. కోర్టు నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు బాత్రా ఆస్పత్రికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కాకపోవటంతో..సిబ్బంది చేతులెత్తేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గుతున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పలువురు రోగులు, డాక్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఢిల్లీకి 976 టన్నుల ఆక్సిజన్ అవసరంకాగా, కేవలం 312 టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేంద్రమిచ్చినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
. అయితే బత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోవడం వారంలో వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఏప్రిల్ 24న కూడా ప్రాణవాయువు నిండుకోవడంతో ఆస్పత్రి ఎస్ఓఎస్ పంపింది. చివరి నిమిషంలో ట్యాంకర్లు చేరుకోవడంతో అప్పుడు ప్రమాదం తప్పింది.
కర్నూలులో ఆక్సిజన్ అందక నలుగురు మతి
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కొవిడ్ బాధితులు మతిచెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ఆస్పత్రులకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నాలుగో పట్ణణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి తనిఖీలు చేయగా.. ఐసీయూలో నాలుగు మతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆక్సిజన్ అందక ఏ ఒక్కరూ మతి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక రోగులు మృతి చెందారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ఎండీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అనుమతి లేకుండానే ఇక్కడ కోవిడ్ చికిత్సలు చేస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించాం'' అని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో గిడ్డయ్య ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.