Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున 'మే డే' నిరసనలు
- నిరసనకారులపై టియర్‌గ్యాస్, లాఠీచార్జ్
- ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, తైవాన్లలో ఆందోళనలు
న్యూఢిల్లీ: సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ఫ్రాన్స్‌లో కార్మికలోకం ఒక్కటై కదలింది. శనివారం కార్మిక దినోత్సవం సందర్భంగా పారిస్ సహా పలు నగరాలు నిరసన ర్యాలీలతో హోరెత్తాయి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా పారిస్, లియాన్, నాంటెస్, లిల్లీ, టోలోయూస్ నగరాల్లో 300కుపైగా నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ సందర్భంగా మేక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. 'నిరుద్యోగ ప్రయోజనాల్లో' ప్రభుత్వం మార్పులు చేయడాన్ని వ్యతిరేకించారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, 'న్యూ సెక్యూరిటీ బిల్లు'ను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని పారిస్‌లో జరిగిన నిరసనల్లో కార్మిక సంఘాల నాయకులు, యెల్లో వెస్ట్ (ఇంధన ధరల పెంపును వ్యతిరేకించారు) ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులంతా మాస్కులు ధరించి, శాంతియుతంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మేక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. చాలా చోట్ల నిరసనర్యాలీలు ప్రశాంతంగా కొనసాగాయి. అయితే లియాన్ నగరంలో నిరసనకారులపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. టియర్‌గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్‌కి దిగి గుంపును చెదరగొట్టేందుకు యత్నించారు. పారిస్‌లో నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి మేక్రాన్ ప్రభుత్వం 5వేల మంది పోలీసుల్ని రంగంలోకి దింపింది. వందలాది మంది నిరసనకారుల్ని అరెస్టు చేసింది. మేడే నిరసన కార్యక్రమాల్లో వామపక్ష నాయకుడు జీన్ మెలాంచన్ పాల్గొని, కార్మికులను, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
మెరుగైన వేతనాలు, పెన్షన్ల కోసం
- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇండోనేషియాలో నిరసనలు
ఇండోనేషియా రాజధాని జకార్తా సహా దేశంలోని 200కుపైగా నగరాల్లో మేడే సందర్భంగా శనివారం పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో చోటుచేసుకున్నాయి. ఈ నిరసనల్లో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం కార్మికుల హక్కుల్ని, సంక్షేమాన్ని దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 3వేల కంపెనీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న 50వేల మందికిపైగా కార్మికులు మేడే నిరసనల్లో పాల్గొన్నారని, ప్రతిచోటా కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించామని 'కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండోనేషియా ట్రేడ్ యూనియన్స్' అధ్యక్షుడు ఇక్బాల్ మీడియాకు తెలిపారు.
ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నిరసన ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. తైవాన్ రాజధాని తైపీలో జరిగిన నిరసనల్లో కార్మికులు 'మెరుగైన వేతనాల' కోసం నినదించారు. ఉద్యోగ భద్రత, పెన్షన్లను అమలుజేయాలని నిరసనకారులు శాంతియుతంగా ఆందోళనను నిర్వహించారు. జకార్తాలో నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి 6వేల మంది పోలీసుల్ని మోహరించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో నిరసన ప్రదర్శనలకు అనుమతించలేదని పలు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.