Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోతారు:
- కేంద్ర ప్రభుత్వానికి వామపక్షాల హెచ్చరిక
- మే డే సందర్భంగా కార్మిక వర్గానికి సంఘీభావం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇది ఇంకెంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు. కేంద్రంలోని ప్రభుత్వం కనీసం ఇప్పటికై నా కండ్లు తెరచి ఈ దిగువ పేర్కొన్న తక్షణ చర్యలను వెంటనే చేపట్టాలి. లేకుంటే అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతారని వామపక్షాలు గట్టిగా హెచ్చరించాయి. అంతర్జాతీయ కార్మికవర్గ దినోత్సవం మే డే సందర్భంగా అంతర్జాతీయ కార్మిక వర్గానికి అవి తమ సంఘీభావాన్ని ప్రకటిం చాయి. ఈ మేరకు నాలుగు వామపక్ష పార్టీలు శనివారం నాడిక్కడ ఒక సంయుక్త ప్రకటన విడుదలజేేశాయి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న కార్మికవర్గంతో భుజం భుజం కలిపి ముందుకు సాగనున్నట్లు ప్రకటించాయి. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ ఎన్నడూ లేనంతటి అత్యంత భయంకరమైన మానవీయ, ఆరోగ్య సంక్షోభంలో దేశం చిక్కుకుంది, ఇది రానురాను మరింత ఉధృతమై మానవాళిపాలిట శాపంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల
ప్రాణాలు, జీవనోపాధిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం ఈ కింది చర్యలను చేపట్టాలని వామపక్షాలు కోరాయి.
1. ఆన్ని ఆస్పత్రులకు, అవసరమున్న వారందరికీ ఆక్సిజన్ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలి.
2. దేశవ్యాప్తంగా ఉచిత సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని చేపట్టాలి. బడ్జెట్లో కేటాయించిన రూ.35 వేలు ఖర్చు చేయాలి. పీఎం కేర్స్ ఫండ్ కింద వసూలు చేసిన మొత్తాలను, అలాగే రూ.20వేల కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని నిలుపుజేసి ఆ మొత్తాన్ని వినియోగించి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి.
3. వ్యాక్సిన్ల, ప్రాణాధార మందుల ఉత్పత్తికి తగిన సామర్థ్యం గత కేంద్రాలన్నిటా తప్పనిసరి లైసెన్సింగ్‌ను ప్రవేశపెట్టాలి.
4. ముఖ్యమైన ఔషధాల, ఆక్సిజన్ ధరలను కఠినంగా నియంత్రించాలి. వీటి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు కళ్ళెం వేయాలి.
5. ఆదాయపన్ను చెల్లించని కుటుంబాలన్నింటికీ రూ.7,500 నగదు నేరుగా బదిలీ చేయాలి. అవసరం అనుకున్న వారందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి.
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని చోట్లా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు వుండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. గతేడాది కాలంలో పరిస్థితి మెరుగుదలకు ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా కాలం వెళ్లబుచ్చింది. పైగా ఈ మహమ్మారి పెద్దయెత్తున విస్తరించే కార్యక్రమాలను చేపట్టిందని, ఇంకా సమయం వృథా చేసే స్థితిలో భారత్ ఇంకెంతమాత్రం లేదని వామపక్షాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై సంతకం చేసినవారిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఎఐఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి దేవవ్రత బిశ్వాస్, ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య ఉన్నారు.