Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10వేల ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు
న్యూఢిల్లీ: కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలకు సమీపంలో తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను ఈ పారిశ్రామిక సంస్థలు అందజేస్తాయి. ఇలా పది వేల ఆక్సిజన్ బెడ్లను స్వల్ప కాల వ్యవధిలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పలు సమావేశాలు జరిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుతమున్న నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లుగా మార్చడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలించిందని పేర్కొన్నారు. అలా నైట్రోజన్ ప్లాంట్లు గల వివిధ పారిశ్రామిక సముదాయాలను కూడా గుర్తించారు. గ్యాస్ రూపంలోని ఆక్సిజన్ వినియోగంపై సమావేశం జరిగిన అనంతరం పలు పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించింది. ఉక్కు కర్మాగారాలు, పెట్రో కెమికల్ రిఫైనరీలు, కంబస్టన్ ప్రాసెస్ జరిపే పరిశ్రమలు, విద్యుత్ కర్మాగారాలు ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్లను కలిగి ఉంటాయి. వాటి నుండి గ్యాస్రూపంలో ఆక్సిజన్ పొందవచ్చు, దాన్ని వైద్య అవసరాల కోసం ఉపయోగించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. ఇలా అవసరమైన స్వచ్ఛతతో ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల పారిశ్రామిక సంస్థలను గుర్తిస్తారు. వాటిల్లో నగరాలకు, డిమాండ్ వున్న సెంటర్లకు దగ్గరలో వున్న వాటిని ఎంపిక చేస్తారు. అక్కడకు సమీపంలో తాత్కాలిక కోవిడ్ కేంద్రాలను ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇటువంటి ఐదు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దానిపై మంచి పురోగతి కనిపిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమలతో చర్చించిన అనంతరం నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ప్లాంట్లుగా మార్చేందుకు 14 పరిశ్రమలను గుర్తించారు. అక్కడ కూడా ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.