Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేరళలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) ఘన విజయం సాధించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రశంసించింది. ఎల్డీఎఫ్ పట్ల మరోసారి విశ్వాసం కనపరిచినందుకు కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న ప్రభుత్వమే తిరిగి ఎన్నిక కావడమనేది కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎల్డిఎఫ్ మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు, అనుసరించిన ప్రత్యామ్నాయ విధానాలకు, ప్రకతి వైపరీత్యాలను, కరోనాను, దాని ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న తీరుకు కేరళ ప్రజలు ఎల్డీఎఫ్కు ఓటు వేశారని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.
బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్లో ధనబలాన్ని ప్రదర్శించినా, అవకతవకలకు పాల్పడిన బీజేపీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. మతోన్మాద సిద్ధాంతాన్ని బెంగాల్ ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో సంయుక్త మోర్చా, వామపక్షాల ప్రదర్శన చాలా పేలవంగా వుంది. బీజేపీని ఓడించాలనే ప్రజల బలీయమైన ఆకాంక్ష సంయుక్త మోర్చాను సన్నగిల్లేలా చేయడానికి దారి తీసింది. ఈ ఫలితాలపై పార్టీ సమీక్షించి, ఆత్మవిమర్శ చేసుకుంటుందని, అవసరమైన గుణపాఠాలను నేర్చుకుంటుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి మంచి విజయాన్ని నమోదు చేసింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వానికి పరాజయాన్ని మిగిల్చారు. అసోంలో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. మహా కూటమి అక్కడ గట్టి పోటీనిచ్చింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోంది.
మొత్తమ్మీద, ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. మతోన్మాద భావనలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు చేసినా, ఎన్నికల వ్యవస్థలో, యంత్రాంగంలో అవకతవకలకు పాల్పడినా ప్రజల మద్దతును పొందడంలో బీజేపీ విఫలమైందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.