Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సంక్లిష్టమైన సమయంలో సవాళ్ళను సమర్థవం తంగా ఎదుర్కొన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అచంచల మైన విశ్వాసంతో అపూర్వమైన రీతిలో మళ్ళీ గెలిపించి నందుకు కేరళ ప్రజానీకానికి తాను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నట్టు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో ఏచూరి మాట్లాడారు. కేరళలో అధికార మార్పిడి సాంప్రదాయాన్ని కాలరాసి
రెండో సారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటమంటే.. సీఎం విజయన్ సర్కారుపై ప్రత్యేక నమ్మకం చూపట మేనని ఆయన చెప్పారు. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి, కేరళలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిందన్నారు. దానికి గల ప్రధాన కారణం ప్రజారోగ్యంపై అక్కడి ప్రభుత్వానికున్న చిత్తశుద్దేనని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలను అన్ని విధాల ఆదుకోవడంలో కేరళ సర్కారు అద్భుత పాత్ర పోషించిందన్నారు. కేరళ సర్కారు చర్యలు అంతర్జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించాయన్నారు. కేరళ మోడల్ అంటే ఏంటో లెఫ్ట్ ప్రభుత్వం చేతల్లో ప్రపంచానికి చూపించిందని తెలిపారు. భారత రాజ్యాంగ, లాకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాలను కాపాడటంలో కేరళ ప్రభుత్వం ముందుందని కితాబిచ్చారు. సీపీఐ(ఎం) సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ముందుంటుందన్నారు. ఇటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా మరింత ధృడనిశ్చయంతో పోరాడుతుందని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రక్రియలో తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన వారందరికీ సీపీఐ(ఎం) తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారందరికీ ఆయన నివాళులర్పించారు. ఇదే స్ఫూర్తితో బెటర్ కేరళని నిర్మించి... బెటర్ ఇండియాని రూపొందిస్తామపీ, అందుకు అవసరమైన చర్యలతో తాము ఎప్పుడూ అగ్రభాగన ఉంటామన్నారు.