Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృణమూల్ ఘన విజయం
- లెఫ్ట్, సంయుక్త మోర్చా ఘోర వైఫల్యం
కొల్కతా: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బెంగాల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాలని విచ్చల విడిగా డబ్బు వెదజల్లి,ంది. కండ బలాన్ని ప్రయోగించింది. మత విద్వేషాలను రెచ్చగొట్టింది. రాజ్యాంగ బద్ధసంస్థలను దుర్వినియోగపరచింది. ఫిరాయింపులను ప్రోత్సహించింది. కేంద్ర బలగాలతో కాల్పులు జరిపించింది. ఇలా అన్ని రకాల కుయుక్తులు, కుతంత్రాలు ప్రయోగించిన బీజేపీని బెంగాల్ ప్రజలు ఛీ కొట్టారు . 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో 200 సీట్లు గెలచుకుంటామని ప్రగల్భాలు పలికిన బీజేపీకి 74 సీట్లు మాత్రమే దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 210 సీట్లను గెలుచుకోగా, లెఫ్ట్, సంయుక్త మోర్చా ఒక సీటులోను, ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీపై బాణం ఎక్కుపెట్టడం ద్వారా తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మమత సులువుగా అధిగమించగలిగారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో మమత వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీని ఓడించి, తృణమూల్‌కు బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్సీలతో కూడిన సంయుక్త మోర్చా చాలా పేలవమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. గత సారి 76 సీట్లు సాధించిన లెఫ్ట్ కూటమి ఈ సారి ఒక్క సీటుకే పరిమితమైంది. బీజేపీ వ్యతిరేక ఓట్లను తృణమూల్ సమర్థవంతంగా తన వైపు తిప్పుకోవడంతో లెఫ్ట్, సంయుక్త మోర్చా కూటమి ప్రజా పునాది చెదిరిపోయింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించింది. తనకు గట్టి పట్టు వున్న దక్షిణ బెంగాల్లో దానిని తిరిగి నిలుపుకోవడమే గాక, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. పురూలియా (5), తూర్పు మిడ్నపూర్,(7), పశ్చిమ మిడ్నపూర్ (13), జోర్గ్రామ్(4), బీర్భుమ్(7), హుగ్లీ (13), దక్షిణ 24 పరగణాలు (27), బంకూరా జిల్లాల్లో తృణమూల్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. మొదటి నుంచి గట్టి పట్టు ఉన్న కలకత్తా జిల్లోలోని 11 స్థానాల్లో పదింటిని తృణమూల్ ఎగరేసుకుపోయింది. పశ్చిమ బర్ద్వాన్, బంకూరా జిల్లాల్లో బీజేపీ నుంచి అది గట్టి పోటీని ఎదుర్కొంది. ఈ రెండు జిల్లాల్లో బీజేపీ ఓ డజను సీట్లు గెలుచుకుంది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆ పార్టీ ఎంపీలు బబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ ఓటమి దిశగా పయనిస్తున్నారు.
మమత బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సుబ్రత ముఖర్జీ, పార్థ చటర్జీ, శోభన్ దేవ్ ఛోటోపాధ్యాయయ సాధన్ పాండే విజయ పథంలో ఉన్నారు. . బెంగాల్ పోస్టల్ బ్యాలెట్లలో తృణమూల్‌కు 16 సీట్లలో మెజార్టీ రాగా, బీజేపీకి 106 సీట్లలోను, లెఫ్ట్, సంయుక్త మోర్చాకు 6 సీట్లలోను అధిక ఓట్లు పోలయ్యాయి. నందిగ్రామ్ లో పోస్టల్ బ్యాలెట్లలో సీపీఐ(ఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీకి అధికంగా వచ్చాయి.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లు మాత్రమే లభించిన బీజేపీ ఈ సారి 74 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి 18 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఆ ధీమాతోనే ఈ సారి అధికారం చేజిక్కించుకోవచ్చని కలలు కన్నది. 2019లో చూపిన సామర్థ్యాన్ని కొనసాగించడంలో అది విఫలమైంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా తమ పదవులకు రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న యుపి అసెంబ్లీ ఎన్నికలపైన, అలాగే 2024 పార్లమెంటు ఎన్నికలపైనా ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.
మమతకు మోడీ అభినందనలు
బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినందుకు ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అలాగే కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన మద్దతును బెంగాల్ ప్రభుత్వానికి అందించేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు.