Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్ విధిస్తే మంచిది
- ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
- జేవీవీ ఫేస్బుక్ లైవ్‌లో డాక్టర్ ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ
నవతెలగాణ బ్యూరో - హైదరాబాద్
గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మాట నిజమేనని పల్స్ హార్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అధ్యక్షతన కరోనా-2 నివారణ చర్యలు అనే అంశంపై ఆయన ఆదివారం ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడారు. కరోనా రోగి సమీపంలో ఉన్న వారికి, మూసి ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కరోనా రెండో దశలో చిన్నపిల్లలు, యుక్త వయస్సులో ఉన్న వారు కూడా ఎక్కువగా దాని బారిన పడుతున్నారన్నారు. లాక్డౌన్ పెట్టినప్పుడు కేసులు తగ్గుతాయనీ, ఎత్తేసినప్పుడు మళ్లీ పెరుగుతాయని గుర్తుచేశారు. అయితే ఆ సమయంలో వైద్యపరంగా ఆక్సిజన్, ఔషధాలు సమకూర్చుకోవటం లాంటివి చేసుకునే వీలుంటుందన్నారు. లాక్డౌన్ విధిస్తే మంచిదనీ, ప్రభుత్వం బలవంతంగా పెట్టే పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తే లాక్ డౌన్ అవసరముండబోదని వ్యాఖ్యానించారు.
కరోనా సెకెండ్ వేవ్‌తో ఆగదనీ, మూడో దశ కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఆ దశ రాకముందే చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కరోనా సోకుకుతుందనీ, అయితే దాదాపు మరణాలు జీరో అవుతాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సెకెండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడదని స్పష్టం చేశారు. మాస్కు సరిగ్గా పెట్టుకోవటం, భౌతిక దూరం పాటించటం ద్వారా సెకెండ్ వేవ్ లో ప్రమాదం బారిన పడకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. లావు ఎక్కువగా ఉన్న వారు అత్యధికంగా మరణిస్తున్నారనీ, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు తగిన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు వచ్చిన తర్వాత అని కాకుండా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు మొదలు కాగానే ఐసోలేషన్ పాటించాలని కోరారు.
దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు 200 కోట్ల డోసులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు కలిసి 30 లక్షల డోసుల ఉత్పత్తి మాత్రమే ఉందని తెలిపారు. రష్యా నుంచి స్పుత్నిక్-వి తయారీకి దేశంలో ఐదు కంపెనీలకు అనుమతి ఇచ్చారనీ, మరి కొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతించే అవకాశముందన్నారు. ఇదంతా అనుకున్నట్టు జరిగినా అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందనీ, అంత వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలనిడాక్టర్ ముఖర్జీ కోరారు. సైడ్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిప్రజల్లో అనవసరపు అనుమానాలు వ్యాపించకుండా వాస్తవాలను ప్రభుత్వం పరిశీలించాలనీ, ప్రచారం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోగానే సరిపోదనీ, రెండో డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత మాత్రమే సురక్షితమని భావించాలన్నారు. లక్షణాలున్న వారు 14 రోజులు తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలనీ, అదే విధంగా కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇతర జనం గుమి గూడే ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందు కోసం ఒక స్వచ్ఛంద పర్యవేక్షణ కమిటీ ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. అనంతరం శ్రోతలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఫేస్ బుక్ లైవ్ లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వరప్రసాద్, హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ ఎ.సురేశ్ కుమార్ పాల్గొన్నారు.