Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ వారియర్స్‌గా జర్నలిస్టులు !
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదివరకే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్డౌన్ విధిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజులపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య సేవలు, ఇతర ఇతర అత్యవసర సేవలకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపును ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఉదయం 7 నుంచి 12 గంటల వరకు పౌరులు తమ ఇంటికి 500 మీటర్ల పరిధిలో కూరగాయల వంటి నిత్వావసరాలను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. ఇక వారాంతాల్లో (శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు) సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కాగా, మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వర్కింగ్ జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్‌గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు.
హర్యానాలో వారంపాటు లాక్డౌన్ !
కరోనా ఉధృతి కొనసాగుతున్న హర్యానాలో సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ విధించనున్నామని రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నా.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ కరోనా చైన్‌ను బ్రేక్ చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హర్యానాలో కొత్తగా13,588 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,01,566కు చేరగా, మరణాలు 4341కి పెరిగాయి.
యూపీలో వారాంతపు లాక్డౌన్ పొడిగింపు
ఉత్తరప్రదేశ్ కరోనా కల్లోలం రేపుతోంది. కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారంతపు లాక్డౌన్ విధించింది. దీనిని సోమవారం ఉదయం వరకు వుండగా... సోమవారం సమయం కలుపుకుని మంగళవారం ఉదయం 7 గంటల వరకు వారంతాపు లాక్డౌన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమయంలో అత్యవసర సర్వీసులకు సంబంధించిన సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, యూపీలో 30,180 కేసులు, 304 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 12,82,504కు చేరగా, మరణాలు 12,874 పెరిగాయి.
గోవాలో మే 10 వరకు లాక్డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న గోవాలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 3 నుంచి మే 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, క్యాసినోలు, బార్లు, స్పోర్ట్స్, సనీ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, రివర్ క్రూయిజ్‌లు సహా అన్ని మూసివేయబడతాయి.
కుంభమేళా నుంచి తిరిగివచ్చిన వారిలో
99 శాతం మందికి వైరస్
హరిద్వార్ కుంభమేళాలో పాల్గొని మధ్యప్రదేశ్‌కు తిరిగివచ్చిన వారిలో 99 శాతం మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. కుంభమేళలో పాల్గొని ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన 61 మంది యాత్రికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభమేళలో పాల్గొన్న మరింత మందిని గుర్తించకపోవడంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కుంభమేళలో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.