Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ దాని మిత్రపక్ష రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు :ఎస్కేఎం నేతలు
న్యూఢిల్లీ: కార్మిక, కర్షక ఉద్యమ ప్రతిబింబమే ఈ ఎన్నికల ఫలితాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారం 157వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు బల్వీర్ సింగ్ రాజేవాల్, హన్నన్ మొల్లా, డాక్టర్ దర్శన్ పాల్, యుధ్వీర్ సింగ్, జగ్జీత్ సింగ్ దల్లెవాల్, గుర్నమ్ సింగ్ చాదుని, యోగేంద్ర యాదవ్, అభిమన్యు కోహర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, దాని మిత్రపక్ష రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల ఇచ్చిన తీర్పును స్వాగతించారు. అసోం, పుదుచ్చేరిలో బీజేపీ మత, అనైతిక రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయనీ, ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో బీజేపీ విభజన మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని స్పష్టమైందని పేర్కొన్నారు. 'బీజేపీ మతోన్మాద ఎజెండా ఆమోదయోగ్యం కాదని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పటికే నిరూపించారు. ఇది జీవనోపాధి కోసం జరుగుతున్న పౌరుల ఏకీకత పోరాటం. బీజేపీని ఓడించాలని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కోరాం. స్పందించినందుకు బెంగాల్, ఇతర రాష్ట్రాల పౌరులను అభినందిస్తున్నాం. ఇప్పుడు దేశం నలుమూలల్లో తమ ప్రతిఘటనను మరింత బలోపేతం చేయాలనీ, ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమం మన రాజ్యాంగం అనుసరించే ప్రజాస్వామ్య విలువలను వ్యాప్తి చేస్తూనే ఉంటుంది. మా డిమాండ్లు నెరవేరే వరకు మరింత బలోపేతం అవుతుంది' అన్నారు. కరోనా పేరిట పంజాబ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను, రైతులపై పోలీసు కేసులను ఎస్కేఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. యువ కార్యకర్త మొమితా బసు ఆకస్మిక మరణ:పట్ల సంయుక్త కిసాన్ మోర్చా కోర్ కమిటీ సంతాపం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి రైతుల ధర్నాకు వచ్చిన మోమిత నిరసన ప్రదేశాల్లో చురుకుగా పాల్గొన్నారు. రైతుల పోరాటంలో ఆమె త్యాగం గుర్తుండి పోతుంది.
రైతు వ్యతిరేకి బీజేపీని ప్రజలు తిరస్కరించారు : ఏఐకేఎస్‌సీసీ
రైతు వ్యతిరేక బీజేపీని ఓడించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రజలను అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) అభినందించింది. మోడీ పాలనలో కార్పొరేట్ అనుకూల విధానాల్లో భాగంగా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలపట్ల ప్రజలకున్న వ్యతిరేకతే ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపింది. బీజేపీకి ఓటువే యొద్దంటూ... ఎస్కేఎం, ఏఐకేఎస్‌సీసీ నేతృత్వంలో 100 మందికి పైగా బహిరంగ సమావేశాలు నిర్వహించారు. బీజేపీ చేసిన దుశ్చర్యలను వివరిస్తూ లక్షలాది కరపత్రాలు పంపిణీ చేశారు.