Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మినీ దంగల్‌లో బీజేపీకి భంగపాటు
- మత రాజకీయాలను తిప్పికొట్టిన ఓటరు
- కంగుతిన్న కాషాయ కూటమి.. ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకంజ
- కేరళలో లెఫ్ట్, తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో తృణమూల్ విజయఢంకా
- నందిగ్రామ్‌లో మమత ఓటమి
- అసోంలోనూ ఎర్రజెండా.. తమిళనాడులో వామపక్షాల విజయం
కరోనా విరుచుకుపడుతున్న కాలంలో 62 రోజులపాటు సాగిన మినీదంగల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. దేశంపై ఏక పార్టీ పాలన రుద్దాలని చూసిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళలోనూ మతరాజకీయాలు చేయాలనుకున్న కాషాయపార్టీ పప్పులుడకలేదు. బీజేపీకి అక్కడున్న ఒక్క సీటూ పోయింది. ప్రకృతి విపత్తులు వచ్చినా... కరోనా కోరలు విప్పినా...కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేరళ రాష్ట్రానికి అస్సలు సహకరించలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకోసం ఒంటరిపోరాటం చేసిన విజయన్ సర్కార్ వేసిన అడుగులవైపే ఓటరన్న మొగ్గుచూపాడు. కేరళలో లెఫ్ట్ సర్కార్‌కు మళ్లీపట్టం కట్టి చరిత్ర సృష్టించాడు. కాషాయపార్టీని కేరళ జనం కడిగేశారు. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడులో సీబీఐ, ఈడీ దాడులకు పురమాయించటం.. అక్కడి నేతల్ని బెదిరించి మరీ కండువా మార్పించుకున్న బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మోడీ, అమిత్‌షా సహా క్యాబినెట్ మంత్రులు, స్టార్లను రంగంలోకి దింపారు. అంతటితో ఆగకుండా బంగ్లాదేశ్‌కు వెళ్లి బెంగాల్ ఎన్నికల్లో గెలవటానికి మోడీ చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టాయి. ఎన్నికల ఫలితాల్లో కాషాయపార్టీకి చావుతప్పి కన్నులొట్టపొయిన చందంగా మారింది. ఐదునెలలకు పైగా నల్లచట్టాలు రద్దుచేయాలని కోరుతూ.. ఢిల్లీ సరి హద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనను పట్టించుకోలేదు. సంస్కరణల పేరుతో తెచ్చిన కార్మిక కోడ్లపై నిరసనలు వ్యక్తమైనా.. నిర్లక్ష్యమే సమాధానం. కరోనా ప్రళయంగా మారుతున్నదన్న హెచ్చరికల్ని పెడచెవిన పెట్టిన మోడీ ప్రభుత్వంపై ప్రజలు అవకాశం కోసం ఎదురుచూశారు. బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్, కార్పొరేట్లకు అమ్మేస్తామంటూ బీజేపీ సర్కార్ బరితెగింపును వ్యతిరేకిస్తూ.. కాషాయపార్టీ దిమ్మతిరిగేలా ఓటరు గట్టిగా బుద్ధిచెప్పాడు. మొత్తం మీద ఈ ఫలితాలు మితవాద బీజేపీకి గట్టి షాక్నివ్వడం లౌకిక ప్రజాతంత్ర శక్తులకు కొండంత ఊరటనిచ్చాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడే శక్తులకు మరింత ఊపునిచ్చాయి.
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. మినీ దంగల్ పోరులో.. మమత హ్యాట్రిక్ సాధించగా.. కేరళ లోనూ లెఫ్ట్ రెండోసారి అధికారం దక్కించుకు న్నది. తమిళనాడులో అధికారపీఠానికి దూరంగా ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ తొలిసారి సీఎం పదవిని దక్కించుకోనున్నారు. తమిళనాడులో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న డీఎంకే అనుహ్యంగా అధికారపగ్గాలను అందుకోనున్నది. పశ్చిమబెంగాల్లో బీజేపీ, తృణమూల్ మధ్య పోటాపోటీగా ప్రచారాలు చేసినా.. తృణమూల్‌కే ఓటర్లు పట్టం కట్టారు. అసోం రెండోసారి బీజేపీ వశమైనా.. పుదుచ్చేరిలోనూ కమలంపార్టీ గెలి చింది. అయితే ఊహించనివిధంగా ఐదురాష్ట్రాల్లో ని ఓటర్లు ఇంతలా వ్యతిరేకిస్తుంటే.. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మా పరిస్థేంతనే భయం బీజేపీ వర్గాలను కలిచివేస్తున్నది. బెంగాల్లో 294 స్థానాలకు గాను 215 స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ కూటమి గెలుచుకోగా, బీజేపీ 74 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. లెఫ్ట్, సంయుక్త మోర్చాలోని కూటమి, ఇండిపెండెంట్లకు చెరొక స్థానం లభించింది. కాగా నందిగ్రామ్‌లో మమత బెనర్జి ఓటమిపాలయ్యారు.
కేరళలోని 140 స్థానాలకు గాను సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఒకే ప్రభుత్వం వరుసగా రెండో సారి గెలవడం గతనలభై ఏండ్ల కేరళ చరిత్రలో ఇదే మొదటిసారి. 234 స్థానాలున్న తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి 145 స్థానాలను గెలుచుకోగా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 70 స్థానాలు దక్కాయి. కడపటి వార్తలందేసరికి తమిళనాడులో డీఎంకే మిత్ర పక్షమైన సీపీఐ(ఎం),సీపీఐ చెరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 126 స్థానాలు ఉన్న అసోంలో బీజేపీ 58 స్థానాలు గెలుచుకుని రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. మహాజోత్ కూటమి ఏఐయూడీఎఫ్ 16 స్థానాలను గెలుచుకుని బీజేపీకి మంచి పోటీ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎఐఎన్ ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా అతి కష్టం మీద బయటపడింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ కూటమికి 16 స్థానాలు రాగా, కాంగ్రెస్-డీఎంకే కూటమికి 10 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు వచ్చాయి. అన్నాడీఎంకేకు పాండిచ్చేరిలో ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం.