Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, దాని మిత్రపక్షాల నుంచి ప్రాతినిధ్యం నిల్
గువహతి: ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీకి 31 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ, దాని మిత్రపక్షాల కూటమి నుంచి మాత్రం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన 8 మంది ముస్లిం అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ విజయం సాధించలేదు. బీజేపీ కూటమికి ఉన్న ఒక్కగానొక్క ముస్లిం ఎమ్మెల్యే అమీనుల్ హక్ లష్కర్... ఏఐయూడీఎఫ్ అభ్యర్థి ఉద్దీన్ బర్భూయియా చేతిలో 19వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక గెలిచిన 31 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ నుంచి 15 మంది, ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్) నుంచి 16 మంది ఉన్నారు. 1983లో అసోం అసెంబ్లీకి అత్యధికంగా 33 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 31 మంది ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 75 స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్తో పాటు పలు పార్టీల కూటమి మహాజోత్ కేవలం 50 స్థానాలను దక్కించుకోగలిగింది. ఈ విజయంతో బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనున్నది.