Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 బౌద్ధ కుటుంబాలపై సామాజిక బహిష్కరణ
ముంబయి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రశంసిస్తూ నినాదాలు చేయడమే ఆ కుటుంబాలు చేసిన నేరమైంది. అంబేద్కర్ను పొగిడినందుకు మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా మోద్ఖేద్ తాలుకాలో రోహి పింపల్గావ్ గ్రామంలో 30కు పైగా బౌద్ధ కుటుంబాలపై 400కుపై మరాఠీ కుటుంబాలు సామాజిక బహిష్కరణ శిక్ష విధించాయి. స్థానిక బజార్లు, కిరాణా షాపులు, ఔషధ దుకాణాలు, పాల కేంద్రాల వద్దకు ఈ కుటుంబాలు వెళ్లకుండా గ్రామంలోని మరాఠాలు నిషేధం విధించారు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 25న గ్రామంలో కొంతమంది యువకులు కార్యక్రమాలు నిర్వహించారు. వీరిని చెదరగొట్టడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో బౌద్ధ కుటుంబాలకు చెందిన కొంతమంది యువకులు అంబేద్కర్ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ను గుర్తుచేసుకోవడం, ఆయనకు గౌరవం ఇవ్వడం మరాఠా సామాజికి వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఏప్రిల్ 27న వారంతా సమావేశమై దళితులు, బౌద్ధ కుటుంబాలకు చెందినవారిని కులంపేరుతో దూషించారు. కొంతమందిపై భౌతికంగా దాడికి పాల్పడ్డారు. దీంతో దళిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును మోద్ఖేద్ పోలీస్స్టేషన్ సిబ్బంది పట్టించుకోలేదు. చివరికి భీమ్ ఆర్మీ జోక్యంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళిత, బౌద్ధ కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధించారు. ఈ గ్రామంలో మరాఠాలు, బౌద్ధులు, దళితులు, ఓబిసిలు అంతా కలిసే ఉన్నా మరాఠాలదే ఆధిక్యం. 2001లోనూ దళితులను కొన్ని నెలలపాటు బహిష్కరించారు. దళితులపై బహిష్కరణ నేపథ్యంలో దళిత సంఘాలు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ప్రస్తుతం గ్రామంలో భద్రతా దళాలు మోహరించాయి.