Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయనగరం: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆ పార్టీ పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి (57) కరోనాతో సోమవారం తుది శ్వాస విడిచారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందాక ఊపిరి ఆడని సమస్య తరచూ ఎదుర్కొంటుండడంతో నాలుగు రోజుల క్రితం ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. అయినా, పరిస్థితి విషమించి సోమవారం మరణించారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.వి.రమణ, రెడ్డి శంకర్రావు, సిఐటియు, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, పలు ప్రజాసంఘాల నాయకులు సందర్శించారు. సిపిఎం జెండాను కప్పి నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం రెడ్డివాని వలసలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్రీరామమూర్తి మృతికి సిపిఎం రాష్ట్రకమిటీ సంతాపం తెలిపింది. విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాలో ఆయన విశేషమైన కృషి చేశారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, శ్రీరామమూర్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీతానగరం మండలం రెడ్డివానివలసకు చెందిన రెడ్డి అప్పలనాయుడు, పారమ్మకు శ్రీరామ్మూర్తి మొదటి సంతానం. ఇంటర్ చదివిన ఆయన డివైఎఫ్ఐలో 1986 నుండి పని చేశారు. 1988లో సిపిఎం సభ్యుడిగా చేరి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. 1989లో శ్రీదేవితో ఆయనకు వివాహమైంది. 1992 నుంచి పార్వతీపురం కేంద్రంగా సిపిఎం అభివృద్ధికి కృషి చేశారు. పార్టీ పరంగా జిల్లా విభజన జరిగిన నేపథ్యంలో 2018 నుంచి పార్వతీపురం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1995లో లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీ రైతు సమస్యలపైన, 2005-06లో తోటపల్లి నిర్వాసితుల సమస్యలపై జరిగిన పోరాటాల్లో ముఖ్య పాత్ర వహించారు. దళిత, గిరిజన, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బడిదేవరకొండ, బోరుకొండల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. శ్రీరామ్మూర్తి భార్య శ్రీదేవి ఐద్వా పార్వతీపురం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. ప్రజలతో మమేకమై నాయకునిగా ఎదిగిన శ్రీరామ్మూర్తి మృతి పట్ల సిఐటియు రాష్ట్ర కమిటీ నివాళులర్పించింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.నర్సింగరావు, ఎంఎ.గఫూర్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామమూర్తి లేని లోటు తీర్చలేనిదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వివెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.