Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల పాటు నీట్ పిజి పరీక్ష వాయిదా
- సీనియర్ల పర్యవేక్షణలో విద్యార్థుల విధులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తగినంత మంది వైద్యులు లేని నేపథ్యంలో ఎంబిబిఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను కరోనా విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నీట్-పిజి పరీక్షలను నాలుగు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందంటూ దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడికల్ ఇంటర్న్ చేస్తున్న వారిని వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్ విధులకు ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను టెలీ కన్సల్టేషన్‌తోపాటు అధ్యాపకుల పర్యవేక్షణలో స్వల్ప లక్షణాలున్న కోవిడ్ బాధితులకు చికిత్స అందించే విధుల్లో నియమించనున్నారు. బిఎస్సి, జిఎన్ఎం క్వాలిఫైడ్ నర్సులను సీనియర్ డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో ఫుల్‌టైమ్ కోవిడ్ నర్సింగ్ డ్యూటీల్లో నియమించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. దీనివల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడింది. కరోనా విధుల్లో వంద రోజులు పూర్తి చేసుకున్న వైద్య సిబ్బందికి రానున్న ప్రభుత్వ రెగ్యులర్ నియామకాల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
నాలుగు నెలలపాటు నీట్ పిజి పరీక్ష వాయిదా
నీట్ పిజి పరీక్షను నాలుగు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది ఆగస్టు 31కి ముందుఈ పరీక్ష ఉండబోదని తెలిపింది. పరీక్షకు సంబంధించి తేదీలను ప్రకటించిన తర్వాత కూడా విద్యార్థులకు నెల రోజుల వ్యవధి ఇస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా కోవిడ్ విధులకు మరింత మంది వైద్య సిబ్బంది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కొత్త బ్యాచ్‌ల పిజి విద్యార్థులు వచ్చే వరకు ఫైనల్ ఇయర్ విద్యార్థుల సేవలు కొనసాగుతాయని పేర్కొంది.
కోవిడ్ విధుల్లో చేరేవారికి వ్యాక్సిన్
కోవిడ్ సంబంధిత విధుల్లో చేరే మెడికల్ విద్యార్థులు, నిపుణులందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని, వీరంతా కోవిడ్-19పై పోరులో ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తున్న ప్రభుత్వ బీమా పరిధిలోకి వస్తారని పేర్కొంది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య నిపుణులు వెన్నెముక వంటివారని, వారు ఎంత ఎక్కువగా ఉంటే పోరు అంత విస్తృతంగా ఉంటుందని వివరించింది.