Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అవినీతి, అక్రమాలపై చర్యలేవి : రాజకీయ విశ్లేషకులు
- ప్రజల ప్రాణాలు పోతున్నా..భారీ ఎన్నికల ర్యాలీలు ఆపలేరా?
- వైరస్ విజృంభిస్తుందని తెలిసీ చర్యలు చేపట్టలేదు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ఎన్నికల సంఘం పోషిస్తున్న పాత్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా మునపటి స్థాయిలో పనిచేయటం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తీరు వివాదాస్పదమైంది. పలు రాష్ట్రాల్లో హైకోర్టులు సైతం తీవ్రంగా తప్పుబట్టాయి. '' మీపై హత్యానేరం మోపాలి. కరోనా మరణాలకు కారకులు మీరే..''నని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం చర్చనీయాంశమైంది.
ఆనాటి పదును ఏది?
ఎన్నికల సంఘం నిబంధనల్ని పూర్తిస్థాయిలో అమలుజేసిన వ్యక్తిగా ఇప్పటికీ టి.ఎన్.శేషన్‌ను గుర్తు పెట్టుకుంటారు. ఆయనలాగా స్వతంత్రంగా, సృజనాత్మకంగా పనిచేసేవారు లేకనే ఈసీపై అపనమ్మకం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టి.ఎన్.శేషన్ ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్న సమయాన, ఆయనతో కలిసి పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఈ.ఎ.ఎస్.శర్మ మాట్లాడుతూ...'' భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం అధికారాల్ని శేషన్ పూర్తిస్థాయిలో వినియోగించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టానికి కొత్త రక్తం ఎక్కించారు. రాజకీయ పార్టీలు సహకరించకపోతే 1992లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్ని రద్దు చేశాడు. ఎన్నికల ఖర్చు లెక్కలు చూపలేదని 1488 మంది లోక్‌సభ అభ్యర్థులపై మూడేండ్లపాటు వేటు వేశారు. ఓటర్లును ప్రభావితం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆదేశించారు'' అని ఆయన గుర్తుచేశారు. ఇవన్నీ ఎన్నికల సంఘంపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడలా లేదే..
శేషన్ ఎలాంటి కరుకైన నిర్ణయాలు తీసుకున్నారో, తాజా ఉప ఎన్నికల్లో అలాంటి సందర్బాలు అనేకం వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చాలా రాజకీయపార్టీలు తమ ఎన్నికల వ్యయాన్ని ఈసీకి సమయానికి ఇవ్వలేదు. బడా కార్పొరేట్ల నుంచి రాజకీయ విరాళాలపై కంపెనీల చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం పరిశీలన చేస్తామని ఈసీ చెప్పలేకపోయింది. ఎన్నికల అక్రమాలు, అవినీతికి పాల్పడ్డవారిపై ఈసీ ఎక్కడా కేసులు నమోదుచేయలేదు. ఇవేగాక..ఓవైపు కరోనా తరుముతుంటే..భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలను ఈసీ అడ్డుకోకపోవటం, అనుమతి ఇవ్వటం వివాదాస్పదమైంది. కోవిడ్-19 నిబంధనల్ని పక్కాగా అమలుజేయటంలో ఈసీ పూర్తిగా విఫలమైందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
- కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్నారన్న కారణంగా ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రుల పట్ల ఈసీ మెతక వైఖరి కనబర్చింది.
- ప్రజల ప్రాణాలకే ముప్పు పొంచివుందని ప్రచార ర్యాలీలను, సభలను రద్దు చేసి ఉండాల్సింది. అలా చేయలేదు.
- తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని ఎక్కడా హెచ్చరించిన దాఖలా లేదు.
- వైరస్ ఉధృతి నగరాల నుంచి గ్రామాలకు వెళ్లడానికి ఎన్నికల ర్యాలీలు, భారీ సభలే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.