Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్నం 12 వరకే షాపులు
అమరావతి: ప్రమాదకరంగా మారుతున్న కోవిడ్‌ను నియంత్రణలోకి తెచ్చేందుకు బుధవారం నుండి పగటిపూట కూడా రాష్ట్రంలో కర్ప్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజునుండి మధ్యాహ్నాం 12 గంటల వరకు షాపులు, ఇతరత్ర కార్యక్రమాలకు అనుమతి ఇస్తారు. ఆ సమయంలో 144వ సెక్షన్ అమలులోకి వస్తుంది. 12 గంటల తరువాత కఠినంగా కర్ప్యూ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నారు. రెండు వారాల పాటు కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఆక్సిజన్ స్టోరేజీకి అవసరమైన ట్యాంకర్లను అందుబాటులో వుంచాలని అన్నారు. ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు ప్రభుత్వ ఎంప్యానెల్‌లో (జాబితా)లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు . ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కరోనా ఆస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను వివరించారు.ఆక్సిజన్ వసతి ఉన్న ఆస్పత్రులు రాష్ట్రంలో 146 వుంటే అందులో ఆక్సీజన్ పైప్‌లైన్ వున్న బెడ్లు 26,446 వున్నాయని తెలిపారు. రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్రస్తుతం వినియోగిస్తున్నామని, ఈనెల రెండో వారం చివరి నాటికి వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక అందులో 448 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం తెచ్చుకోగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటిదాకా 52 లక్షల మందికి తొలివిడత వాక్సిన్ ఇచ్చామని, ఇంకా 1,33,07,889 మందికి వాక్సిన్ ఇవ్వాల్సి వుందని వివరించారు.
మరో 18,972 మందికి...
రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 18,972 మంది కరోనా బారిన పడ్డారు. 71 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2628 కొత్త కేసులు నమోదయ్యాయి. . అత్యల్పంగా కష్ణాలో 969 కేసులు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమాదు అయ్యాయిరాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,18,148 శాంపిల్స్ పరీక్షించగా 11,63,994 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,03,935 మంది కోలుకొని డిశ్చార్జికాగా 8207మంది ప్రాణాలు కోల్పోయారు.
నేడు కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు (మంగళవారం) జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి కొరత తదితర సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి.