Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ రాష్ట్రం ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరఫరా విషయంలో స్వయం సమృద్ధి సాధించగలిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా పేషెంట్లకు కావలసినంత మేరకు ఆక్సిజన్ అందించగలుగుతున్నారు. ఇప్పుడు కేరళ లో కోవిడ్-19 ఉధృతి తీవ్రంగానే ఉంది. ఐనప్పటికీ తమ రాష్ట్ర అవసరాలను తీర్చగలిగే పరిస్థితిలో కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఉంది. అంతేగాక కర్నాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించగలుగుతోంది.
కేరళకు రోజుకు సుమారు 98 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అవసరం ఉంది. ఐతే ఇప్పుడు ఆ రాష్ట్రం రోజుకు 204 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని సాధించింది. దాంతో తమిళనాడుకు రోజుకు 74 టన్నులు సరఫరా చేయగలుగుతోంది. తాజాగా డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కేరళ నుండి తమ రాష్ట్రానికి ఆక్సిజన్ ను అందించాలని కోరారు.
గతేడాది కరోనా వెల్లువ తాకగానే సకాలంలో మేల్కొని దీర్ఘకాలిక దృష్టితో అక్కడ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించగలిగింది. నిపుణుల సలహాలను స్వీకరించి ఒక పథకం ప్రకారం చర్యలు చేపట్టింది. దాని ఫలితంగా రెండోసారి కరోనా వెల్లువ పెల్లుబికేనాటికి ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధిని సాధించడమే గాక పొరుగు రాష్ట్రాలకు చేదోడుగా నిలవగలుగుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాటి బాధ్యత గాని, దూరదృస్టి గాని లేకపోయిందన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.రోజూ మన రాష్ట్రంలో ఆక్సిజన్ సకాలంలో అందించ లేకపోయి నందువల్ల మరణిస్తున్న కరోనా పేషెంట్ల విషాద మరణాల వార్తలు గుండెల్ని తొలిచివేస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
హర్షవర్ధన్ జీ దీనికి సమాధానం చెప్పగలరా ?
ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నచోట కమ్యూనిస్టులు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయగలుగుతారో ఆచరణలో కేరళలో చూస్తున్నాం. అధికారంలో లేకపోయినా, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఏం చేయవచ్చో చేసి చూపిస్తున్నారు కామ్రేడ్ ఎస్.వెంకటేశన్.
తమిళనాడు రాష్ట్రంలో మదురై లోక్ సభ స్థానంనుండి సిపిఎం అభ్యర్ధిగా గెలిచిన కా. వెంకటేశన్ ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులకు ఒక లేఖ రాశారు. అందులోని కొన్ని భాగాలు దిగువన ఇస్తున్నాం...
''గతేడాది కోవిడ్-19 మొదటి వెల్లువ సందర్భంగా తలెత్తిన సంక్షోభం నేపధ్యంలో మదురై లో నేను, జిల్లా కలెక్టరు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజాజీ హాస్పిటల్ డీన్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ కూర్చుని ఈ మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఒకే ఒక ఎజండా పై చర్చించాం.
ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమైన చర్యలన్నింటినీ వేగంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాం. ఈ పనిలో సహకరించకుండా అడ్డం పడుతున్న కొందరు అధికారులను గుర్తించాం. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దృష్టికి వారి వ్యవహారం తీసుకెళ్లి, వెంటనే జిల్లానుండి బదిలీ చేసేవిధంగా చూశాం.
ఆస్పత్రులలో ఆక్సిజన్ సామర్ధ్యాన్ని పెంచడానికి అన్నింటికన్నా అధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాజాజీ హాస్పిటల్లో 400 బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ ను అందించగల సామర్ధ్యం ఉంది. అక్కడ 6000 లీటర్ల ఆక్సిజన్ ను మాత్రమే నిల్వ చేయానికి ఏర్పాట్లు
ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పట్టుదలగా కృషి చేసి దీనిని గత జూలై-ఆగస్టు నాటికల్లా 20,000 లీటర్లకు పెంచగలిగారు. ఇప్పుడు అక్కడ 1100 బెడ్లకు ఆక్సిజన్ అందించగలుగుతున్నారు.
అదే తరహాలో దగ్గర్లో ఉన్న తోపూర్ లో (గ్రామీణ ప్రాంతం) ఒక 30 పడకలకు మాత్రం ఆక్సిజన్ అందించగలిగే పరిస్థితి ఉండేది. అక్కడ కూడా అదనపు సామర్ధ్యాన్ని కల్పించి ఇప్పుడు 130 పడకలకు ఆక్సిజన్ అందించగలుగుతున్నారు.
ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా ఈ విధంగా ఆక్సిజన్ సామర్ధ్యాన్ని పెంచడానికి కృషి చేసిన వారందరికీ ప్రత్యేకంగా అభిపందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తక్కిన దేశంలో ఆక్సిజన్ కొరత ఉన్నట్టు ఇక్కడ మదురై నియోజకవర్గంలో లేదు. ముందుగానే మేల్కొని జాగ్రత్త పడి తగు చర్యలు తీసుకోవడం వల్లే మాకు ఇది సాధ్యమైంది. ఎవరి పైనా ఆధారపడకుండా, బైటనుండి ఎటువంటి సహాయమూ లేకుండానే మా సొంత వనరులనుంచే మేము మదురైలో ఇది సాధించగలి గాము. ముఫ్ఫై లక్షల జనాభా ఉన్న మదురై నియోజక వర్గంలో మేము ఏ వనరులూ లేకుండానే మా ఆక్సిజన్ సరఫరా సామర్ధ్యాన్ని నాలుగు రెట్లు పెంచగలిగినప్పుడు అన్ని అధికారాలూ, వనరులూ గుప్పెట్లో పెట్టుకున్న మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయలేకపోతోంది ?'' కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గాని, మోడీ గాని దీనికి సమాధానం చెప్పగలరా ? అసలు వారిదగ్గర ప్రజల బాధలకు స్పందించే సున్నితత్వం ఏ కోశాన ఐనా ఉందా ?