Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనం ప్రాణాలుపోతున్నా.. సెంట్రల్ విస్టాకు లైన్‌క్లియర్
- లాక్డౌన్ ఉన్నా.. పనులు ఆగకూడదు : కేంద్రం మార్గదర్శకాలు
- ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.13,450 కోట్లు
- 15 ఎకరాల్లో ప్రధాని నివాసం
- మోడీ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
కరోనా ప్రళయంతో జనం ప్రాణాలు పోతున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటున్నదనటానికి నిదర్శనమే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు. వ్యాక్సిన్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు లేక ఎందరో అమాయకులు అల్లాడుతున్నారు. ఇంతలా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్నా.. పట్టీపట్టనట్టు వ్యవహరించింది కేంద్ర సర్కార్. మరోవైపు 2022 నాటికి ప్రధాని కలలసౌధమైన సెంట్రల్ విస్టాను పూర్తిచేయాలని భావించింది. లాక్డౌన్ ఉన్నా నిర్మాణపనులు కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వులు ఇపుడు వివాదస్పదంగా మారాయి.
న్యూఢిల్లీ : రోమ్ నగరం తగలబడుతుంటే.. ఆ సామ్రాజ్యాధినేత ఫిడెల్ వాయించుకుంటూ కూర్చున్నాడని చరిత్ర చెబుతున్నది. ఇపుడు దేశంలో ఎటు చూసినా కరోనా ఆర్తనాదాలు.. మరణమృందగాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవటానికి కరోనాను సైతం పట్టించుకోలేదు. ప్రపం చంలో ఎక్కడాలేని విధంగా కేసులు.. మరణాలు సంభవిస్తుంటే... విదే శాలు స్పందిస్తున్నాయి. కానీ దేశప్రధాని మోడీ మాత్రం సెంట్రల్ విస్టా నిర్మించటానికి సన్నద్ధమవుతున్నారు. దేశంలోని పలురాష్ట్రాల్లో లాక్డౌన్ లు విధిస్తున్నాయి. కరోనా ఎప్పుడు ఉపద్రవంలా ముంచుకొస్తుందోనన్న భయం ప్రజల్ని వెంటాడుతున్నది. ఇలా దేశప్రజలే విపత్కర పరిస్థితినెదు ర్కొంటున్న సమయంలో ఈ నిర్మాణాలకు సంబంధించి పర్యావరణ అను మతులు ఇచ్చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మాణపనులు ఆగకూడదనే విధంగా ఉత్తర్వులు జారీచేసింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిర్మాణాలకు పచ్చజెండా..
ముందు కరోనాపై దృష్టిపెట్టాలనీ, ఆ తర్వాత సెంట్రల్
విస్టా నిర్మించుకోవాలని ప్రతిపక్షపార్టీలు సూచిస్తున్నాయి. అయితే ఇవేం పట్టించుకోకుండా మోడీ సర్కార్ మరోసారి మొండిగా సెంట్రల్ విస్టా నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది. ప్రాజెక్టు నిర్దేశితకాలంలో పూర్తిచేసేలా ఆదేశాలిచ్చింది. భవనాలు వచ్చే ఏడాదిలోగా పూర్తిచేయాలని పేర్కొన్నది. అందులో ప్రధాని నివాసం కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం లోక్‌కల్యాణ్ మార్గ్ 7 వద్ద ప్రధాని నివాసమున్నది. ఈ మార్గాన్ని రేస్‌కోర్స్ రోడ్ అని కూడా పిలుస్తారు.
ఉపరాష్ట్రపతి, ఎస్పీజీ హెడ్‌క్వార్టర్ కూడా..
ప్రధాని నివాసంతో పాటు భద్రత ఏర్పాట్లు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ)హెడ్‌క్వార్టర్ కూడా ఈ ప్రాజెక్టులో ఉండేలా నిర్మించనున్నారు. బ్యూరోక్రాట్స్ కోసం ఒక ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ కూడా ఇక్కడ రూపొందిస్తున్నారు. ఈప్రాజెక్టులో ఉపరాష్ట్రపతి నివాసం కూడా ఈ భవంతిలోనే ఉండనున్నది. ఇది వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ.13,450 కోట్లు ఖర్చుచేయనున్నారు. ప్రాజెక్టువల్ల 46వేల మంది కార్మికుల కు ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే..
వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఢిల్లీలో ప్రభుత్వ భవనాలు, నివాసిత భవనాలు కట్టాలని యోచిస్తున్నది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నాలుగు కిలో మీటర్ల ప్రాంతాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం పాతదవ్వటం వల్ల, సెంట్రల్ విస్టా నిర్మిస్తున్నామని కేంద్ర సర్కార్ చెబుతున్నది.
దీనిపై సుప్రీంలో వాదోపవాదనలు జరిగినా.. ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. సెంట్రల్ విస్టా నిర్మాణంపై ప్రతిపక్షాలూ అభ్యంతరం చేయటంలేదు.
అయితే దేశంలో కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో ఇలాంటి కట్టడాలను కొంతకాలం ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం నో అంటూ ముందుకెళ్తున్నది.
అసలింతకీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
రాష్ట్రపతి భవన్, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్, నేషనల్ ఆర్కైవ్స్ భవనం ఒకే విధంగా ఉంటాయి. సెంట్రల్ విస్టా యొక్క మాస్టర్ ప్లాన్ ప్రకారం, కొత్త టికోనా పార్లమెంట్ హౌస్ పాత వృత్తాకార పార్లమెంట్ హౌస్ ముందు గాంధీజీ విగ్రహం వెనుక 13ఎకరాల భూమిలో దీనిని నిర్మించనున్నారు. ఈభూమిలో ఇప్పుడు ఒక పార్క్, తాత్కాలిక నిర్మాణం పార్కింగ్ ప్లేస్ ఉన్నది. కొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఉభయ సభలకు ఒక్కొక్క భవనం ఉంటుంది, కానీ సెంట్రల్ హాల్ మాత్రం ఉండదు.
15 ఎకరాల్లో ప్రధానికి కొత్త ఇల్లు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకింద 15 ఎకరాల్లో పది నాలుగు అంతస్తుల భవనాలతో ప్రధాని కొత్త నివాసం నిర్మించనున్నారు. మంత్రిత్వ శాఖల భాగస్వామ్య కేంద్ర సచివాలయాన్ని రూపొందించడానికి శాస్త్రి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్, కృషి భవన్‌తో పాటు పలు భవంతులను కూల్చేయనున్నారు. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) ఇటీవల చేసిన ప్రతిపాదన ప్రకారం ఈ డిజైన్లకు లైన్ క్లియర్ ఇచ్చారు.