Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టు
- పున:పరిశీలించాలని కేంద్రానికి సూచన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విధానం ప్రజారోగ్య, సమానత్వపు హక్కుకు ప్రమాదకరమని తెలి పింది. ఈ విధానాన్ని పున:పరిశీలించాలని సూచించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు కట్టుబడి ఇది ఉండాలని వివరించింది. నూతన వ్యాక్సిన్ విధానాన్ని కేంద్రం గతనెల 21న వెలువర్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే, ఈ వ్యాక్సిన్ విషయంలో ధరల విధానం వివాదాస్పదంగా మారింది. కేంద్రానికి, రాష్ట్రాల మధ్య ధరల విషయంలో వ్యత్యాసం ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు తాజా
సూచనలు చేసింది. కేంద్రం వ్యాక్సిన్ విధానం ప్రకారం.. ఒక్క డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కేంద్రానికి రూ. 150, రాష్ట్రాలకు రూ. 300, ప్రయివేటు ఆస్పత్రులకు రూ. 600కు అందుబాటులో ఉంటుంది. అలాగే, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్.. కేంద్రానికి రూ. 150, రాష్ట్రాలకు రూ.400, ప్రయివేటు ఆస్పత్రులకు రూ. 1200కు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ విధానం వివిధ తరగతుల ప్రజల మధ్య వివక్షతను చూపెట్టకూడదని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్రావు, రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి
ఆస్పత్రుల అడ్మిషన్లపై జాతీయ విధానాన్ని రూపొందించాలి
కొవిడ్-19 నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఆస్పత్రులకు సరఫరా చేసే ఆక్సిజన్ విషయంలో ఉన్న కొరతను రెండు రోజుల్లో సరిచేయాలని ఆదేశించింది. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్ నిల్వలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వాటిని వికేంద్రీకరించాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని వివరించింది. కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకొనే విషయం పైనా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయనీ, అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువును విధిస్తూ న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర రావు, రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.