Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ.. నిత్యం వేలల్లో ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా మందులు, టీకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కోవిడ్-19 వ్యాక్సిన్ అందరికీ చేరడం లేదు. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్‌పై పేటెంట్ నిబంధనలు అమలు జరప రాదని కోరుతూ పలు దేశాలకు చెందిన 33 కమ్యూనిస్టు పార్టీలు ఓ బహిరంగ లేఖను విడుదల చేశాయి. వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికీ ఉచి తంగా ఇవ్వడంతో పాటు మందుల కంపెనీలు ఈ సంక్షోభ సమయాన్ని తమ లాభాలు పెంచుకునేందుకు వినియోగించుకోకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ లేఖలో ప్రస్తావించాయి.
ఈ లేఖలో ప్రస్తావించిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
1. కరోనా టీకాపై మేథోసంపత్తి హక్కు (పేటెంట్ విధానం) అమలు జరపరాదు. ఇప్పటికే వాడుకలోకి వచ్చిన మందులపై సైతం పేటెంట్ ఉండరాదు.
2. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ అనేవి ప్రభుత్వ అధీనంలో జరగాలి. ప్రభుత్వం ఈ అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి అమలును పర్యవేక్షించాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను వెంటనే పటిష్టపరిచి, విస్తరింప చేయాలి.
3. వాక్సిన్‌పై ఊహాగనాలు అరికట్టాలి. వ్యాక్సిన్‌పై ఉన్న ప్రతి సమాచారం అంటే టీకా తయారీ, రోగికి ఇచ్చే పద్దతిని గురించి వైద్యరంగంలోని అంతర్జాతీయ సంస్థలకు దాపరికం లేకుండా అందజేయాలి. ఈ రంగంలో పరిశోధనలు పోటీతత్వంతో కాకుండా అంతర్జాతీయ సంఘీభావం అనే సూత్రంపై ఆధారపడి జరగాలి.
4. వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాన్ని, అశాస్త్రీయ సమాచారాన్ని నిర్విద్దంగా ఖండించాలి.
5. ఆరోగ్య సంరక్షణ గురించి ప్రజలు పోరాటాలను ఉధృతం చేయాలి. కార్పొరేట్ శక్తుల లాభపేక్షకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని నిర్వహించాలి. పేదల ఆరోగ్య రక్షణకు పాటు పడాలి.
ఈ బహిరంగ లేఖపై సంతకం చేసిన వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటన్ నుంచి రెండు పార్టీలు, బ్రెజిల్ నుంచి రెండు పార్టీలు, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీస్, పాకిస్థాన్, పాలస్తీనా, వెనిజులా సహా పలు దేశాలకు చెందిన పార్టీలు ఉన్నాయి.