Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో విజయంతో రెచ్చిపోతున్న ఆ పార్టీ గూండాలు
- వామపక్ష కార్యకర్తలు, ఇండ్లపై దాడులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తణమూల్ కాంగ్రెస్ గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు గూండాల మాదిరిగా రెచ్చిపోతూ.. వామపక్ష కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. ఈ క్రూరమైన దాడుల్లో అనేక మంది వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారులకు గాయాలయ్యాయి. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. టీఎంసీ గూండాల దాడుల్లో తీవ్ర గాయాలైన వీరు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుద్వ్దాన్ జిల్లా జమల్పూర్లో టిఎంసి కార్యకర్తల దాడిలో వామపక్ష కార్యకర్త, ఐద్వా నాయకురాలు కకాలి క్షేత్రపాల్ కార్యకర్త మరణించారు. ఆదివారం ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత విజయోత్సవాలు చేసుకుంటూ టీఎంసీి కార్యకర్తలు క్షేత్రపాల్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె వంట చేసుకుంటుండగా ఒక పదునైన కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన క్షేత్రపాల్ను ఆసుప్రతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈమె నబగ్రామ్‌లో పోలింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీి గూండాలు 10 మంది వామపక్ష కార్యకర్తలకు చెందిన ఇండ్లపై విధ్వంసం సృష్టించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ గూండాల హింసాకాండలో పలువురు వామపక్ష కార్యకర్తలకు గాయాల య్యాయి. కరోనా నేపథ్యంలో ప్రజలకు పలువిధాలుగా సహాయక చర్యలు చేపడుతున్న రెడ్ వాలంటీర్లపై టీఎంసీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతూ.. భౌతికంగా దాడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీల కార్యాలయాలు, పలువురు కార్యకర్తలు, నేతలకు చెందిన దుకాణాలు, కూల్చివేసి, మంటల్లో తగులబెట్టారు. గెలిచామని తలకెక్కిన గర్వంతో టీఎంసీి గూండాలు పాల్పడుతున్న ఈ దాడులను సీపీఐ(ఎం) తో ఇతర వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. టీఎంసీ సృష్టిస్తున్న ఈ హింసాత్మక వాతావరణానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చి తగిన రీతిలో ప్రతిఘటన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చాయి. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి.
దాడులు దారుణం : ఐద్వా
వామపక్ష, లౌకిక శక్తుల కార్యకర్తలపై హత్యా, ప్రతీకార దాడులకు తక్షణమే స్వస్తి పలకాలని ఐద్వా డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని హంతకులను అరెస్టు చేయాలని కోరింది. తృణమూల్ దాడుల్లో ఇప్పటివరకు 11మంది మరణించారు. బర్ద్వాన్లోని జమల్పూర్కి చెందిన సీపీఐ(ఎం)-ఐద్వా కార్యకర్త కకోలి క్షేత్రపాల్ను ఆమె ఇంట్లో చంపారని పేర్కొంది. ఈ దాడులను ఐద్వా నేతలు మాలిని భట్టాచార్య, మరియం ధావలె ఒక ప్రకటనలో ఖండించారు. 'మహిళలు, చిన్నారులతో సహా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ హింసాకాండను ఖండించాలి. ఇలాంటి అన్యా యానికి బెంగాల్ ప్రజలు ఓటు వేయలేదని ఖచ్చితంగా చెప్పగలను' అని బెంగాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితిన్ ప్రసాద్ ట్వీట్ చేశారు.
బెంగాల్ గవర్నర్‌కు మోడీ ఫోన్, ఆందోళన
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత భారీగా హింస చోటుచేసుకోవడంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధనకర్‌కు మంగళవారం ప్రధాని మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో హింసాకాండపై సీబీఐ విచారణ చేయించాలని సుప్రీంకోర్టులో బీజేపీ నేత ఒకరు పిటిషన్ వేశారు. హింసాకాండలో గాయపడ్డ, మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పరామర్శించనున్నారు. ఫలితాలు వెల్లడైన తరువాత టీఎంసీ గూండాల హింసాకాండలో ఎనిమిదిమంది తమ పార్టీ కార్యకర్తలు మరణించారని బీజేపీ చెబుతోంది.
సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్
బెంగాల్లో హింసాకాండను సుమోటాగా తీసుకుని విచారణ చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ప్రకటించింది. నందిగ్రామ్‌లోని తమ కార్యాలయంపై టీఎంసీ కార్యర్తలు దాడి చేసి, మహిళా కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న దృశ్యాలను బిజెపి నేతలు కైలాష్ విజరువర్గియా, సంబిత్ పాత్ర షేర్ చేసారు. ఈ వీడియోల ఆధారంగా సుమోటాగా విచారణ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ నేతృత్వంలోని బృందం పశ్చిమ బెంగాల్లో పర్యటించి, మహిళలపై దాడులకు సంబంధించి విచారణ చేస్తుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. హింసాకాండపై దర్యాప్తు చేయాలని, నిందితుల్ని అరెస్టు చేయాలని పశ్చిమ బెంగాల్ డిజిపికి కమిషన్ లేఖ రాసింది.
విజయోత్సవాల్లో భాగంగా హింసా?
'టీఎంసీ 'విజయోత్సవాల్లో భాగంగా ఈ భయంకరమైన హింస జరుగుతుందా?.. దీనిని ఖండించాలి. ప్రతిఘటించాలి, తిరస్కరించబడాలి. మహమ్మారిని ఎదుర్కోవడంలో దృష్టి పెట్టడానికి బదులు టీఎంసీ ఇటువంటి అల్లకల్లోలానికి పాల్ప డుతోంది. రక్షించడానికి, సహాయం చేయడానికి, ఉపశమనం కల్పించడానికి సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ఉంటుంది' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
- సీతారాం ఏచూరి