Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలకు రెక్కలు
- హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.94.16
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు విలవిల్లాడు తున్న జనంపై కేంద్రం ఏమాత్ర మూ కనికరం చూపించటం లేదు. ప్రజల బాధలతో సంబంధం లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడును షురూ చేసింది. ఢిల్లీలో మంగళవారంనాడు లీటర్ డీజిల్‌పై 18పైసలు, పెట్రోల్‌పై 15పైసలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ 20 పైసలు పెరిగి రూ.88.25కు, లీటర్ పెట్రోల్ 17పైసలు పెరిగి రూ.94.16కు చేరుకుంది. ధరల పెరుగుదలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదని చమురు మార్కెటింగ్ కంపెనీలు, కేంద్రం చెబుతున్నాయి. అయితే అందులో వాస్తవం లేదనీ, ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి, ప్రజల ఓట్లతో కేంద్ర ప్రభుత్వానికి అవసరం తీరింది కాబట్టి... ఇక బాదుడు మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓ వైపు స్థానిక లాక్‌డౌన్‌తో ఉపాధిపై దెబ్బ, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నవేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధాక్షణ్యంగా ఇంధన ధరల్ని పెంచుతూపోతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఇంధన ధరల పెంపును కేంద్రం పక్కకుపెట్టింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో, డాలరు మారకం రేటులో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం దేశీయంగా ఇంధన ధరల్ని నిర్ణయిస్తున్నాయి. మారిన ధరలు ప్రతిరోజూ ఉదయం 6గంటలకు అమల్లోకి వస్తున్నాయి.
సగానికిపైగా పన్నులే..
పెట్రోల్ రిటైల్ అమ్మకం ధరలో 60శాతానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉన్నాయి. లీటర్ డీజిల్‌లో 54శాతం పన్నులున్నాయి. లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90, లీటర్ డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది.