Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న విజృంభణ
న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. భారత్‌లో మరో రికార్డును సష్టించింది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగానే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలో (3.24 కోట్లు) కేసులు నమోదవ్వగా.. రెండు కోట్ల మార్క్‌ను దాటిన దేశం భారత్ కావడం గమనార్హం.
24 గంటల్లో 3.68 లక్షలు.. మరణాలు 3,417
దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో మరో 3.68 లక్షల మంది కరోనా బారినపడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,04,698 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా, 3,68,147 మందికి పాజిటివ్‌గా తేలింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కి కోట్లకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 16,29,3003 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 81.77 శాతంగా ఉంది. మరణాల సంఖ్య మరోసారి 3 వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా 3,417 మంది కరోనా వల్ల మరణించారు. ఇప్పటివరకు 2,18,959 మంది వైరస్‌కు బలైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో క్రియాశీల కేసులు 34లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.13శాతానికి చేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కాన్పూరులోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.