Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజుల్లో చర్యలు తీసుకోండి
- ఆక్సిజన్‌పై కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : అత్యవసరాల నిమిత్తం ఆక్సిజన్ మిగులు నిల్వలను (బఫర్ స్టాక్) ఉంచాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. వీటిని రాష్ట్రాల సహకారంతో నిర్వహించాలనీ, నిల్వలను వికేంద్రీకరించాలని తెలిపింది. సాధారణ సరఫరా చెయిన్‌కు అంతరాయం ఏర్పడినపుడు తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరింది. కేంద్రం, ఢిల్లీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల వల్ల సామాన్యులకు ఉపశమనం లభించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ లభిస్తుందనే ఒక సన్ననిదారంపై వారి ప్రాణాలు ఆధారపడ్డాయని పేర్కొంది. నాలుగు రోజుల్లోగా మెడికల్ ఆక్సిజన్ అత్యవసర నిల్వలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పరిస్థితి హృదయవిదారకంగా వున్నందున తక్షణమే అక్కడ ఆక్సిజన్ కొరతను పరిష్కరించాల్సి వుందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావు, ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఆక్సిజన్ సరఫరాల బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టివేసుకుంటూ, ప్రజల ప్రాణాలను గాల్లోకి నెట్టివేయరాదని వ్యాఖ్యానించింది. ఇటువంటి జాతీయ సంక్షోభాలు తలెత్తినపుడు పౌరుల ప్రాణాలు కాపాడడమే కీలకమని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా సరిగా వుందో లేదో పర్యవేక్షించేందుకు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలనీ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం చర్చలు జరుపుతూ తగు చర్యలు తీసుకోవాలని కోరింది.