Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పేషంట్లకు నో ఎంట్రీ
- పెరుగుతున్న కోవిడ్ మరణాలు
- సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళిక కేంద్రం వద్ద లేదు : రాజకీయ విశ్లేషకులు
- దేశంలో మునుపెన్నడూ లేని ఘోర విపత్తు ఇది..
న్యూఢిల్లీ : గతంలో ఒక రోగి ఆక్సిజన్ అందక హాస్పిటల్లో ప్రాణాలు పోయిన ఘటనలు చాలా అరుదు. అలాంటిది నేడు దేశంలో కొన్ని వేలమంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు. కరోనా రెండో వేవ్ ప్రధానంగా ఆక్సిజన్‌తో ముడిపడి ఉందని తేలిపోయింది. ఆక్సిజన్ కొరత తీర్చాలని మోడీ సర్కార్‌ను రాష్ట్రాలు వేడుకుంటున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు లేవనే కారణంతో రోగిని హాస్పిటల్స్ చేర్చుకోకపో వటం.. రోజూ జాతీయ మీడియాలో ప్రసారమవుతోంది. ఇంత జరుగుతున్నా..ఇప్పటికీ సమస్యపై కేంద్రం పెద్దగా దృష్టిపెట్టలేదని తెలుస్తోంది. కేంద్రం వద్ద కరోనా సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళిక లేకపోవటం, కృత్రిమ కొరతను అడ్డుకోకపోవటం సమస్య తీవ్రరూపం దాల్చడానికి దారితీసిం దని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పీఎం-కేర్స్‌కు దేశవ్యాప్తం గా వేల కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని, వీటితో ఎన్నో వందలాది హాస్పిటల్స్‌ను 'కోవిడ్ పేషంట్ల' కోసం సిద్ధం చేయవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికీ పీఎం-కేర్స్ ఫండ్‌లోని నిధులపై బ్యాంకు వడ్డీ భారీగా వస్తోందని, మరోవైపు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం వద్ద విపత్తు నిధులు, పీఎం-కేర్స్ ఫండ్ ఉన్నా లాభమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తేచాలని, వేలాది ప్రాణాలు నిలబ డతాయని వారు చెబుతున్నారు. కరోనా రెండో వేవ్ వస్తుందనీ కేంద్రా నికి ముందే తెలుసు, అందుకు అనుగుణంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఎందుకు సిద్ధం చేసుకోలేకపోయామని వారు ప్రశ్నిస్తున్నారు.
బాధితులు ఎక్కడికి పోవాలి?
ఢిల్లీలో కరోనా రోగుల బాధలు ఏ స్థాయిలో ఉన్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. కేంద్రంలోని పాలకులూ చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ కరోనా రోగుల్ని చేర్చుకోకపోవడానికి ఒకే ఒక్క కారణం...ఆక్సీజన్ కొరత. ఇప్పటికీ ఢిల్లీలో హాస్పిటల్స్‌కు ప్రభుత్వం నుంచి సరిపడా ఆక్సిజన్ సరఫరా లేదు, మరోవైపు ప్రయివేటు ఫిల్లింగ్ కేంద్రాల్ని బలవంతంగా మూసేశారు. ఈనేపథ్యంలో వైరస్ బాధితులు ఎక్కడికి పోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? అన్నది ప్రధాన ప్రశ్న. సంక్షోభ సమయాన ఆక్సిజన్ లభ్యతకు ఉన్న మార్గాలన్నీ తెరుస్తారా? మూస్తారా? ఇదేం ప్రభుత్వ విధానం?..అని వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కరోనా బాధితుల్ని తీవ్రంగా వేధిస్తోంది. బాధితుల్ని ఆదుకోవడానికి వందలాది స్వచ్ఛంద సేవా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఆక్సిజన్ కొరతపై ఒక వాలంటీర్ అమన్ శర్మ ఏమన్నారంటే..'' ఆక్సిజన్ సిలిండర్ కోసం ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు 300 కిమీలు (మే 1, 2 తేదీల్లో) తిరిగాను. నాకు ఎక్కడా దొరకలేదు. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం ప్రధాన కేంద్రాలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా పెంచమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యంత దీనంగా ప్రధాని మోడీని వేడుకుంటున్నారు'' అని చెప్పాడు.
కేంద్రపాలకుల వైఫల్యమే
'' ఆహార కొరత వల్ల కరువు రాదు, ఆహార పంపిణీ ప్రణాళిక సరిగాలేక కరువు వస్తుంది'' ...ఇది ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ విశ్లేషణ. ఆహార కొరత, కరువు పరిస్థితులపై ఆయన మాటలు 'ఆక్సిజన్ కొరత'కు వర్తిస్తాయని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. దేశంలో కావాల్సినంత ఆక్సిజన్ ఉన్నా..అది హాస్సిటల్స్‌కు చేరటం లేదు. ఇది పూర్తిగా కేంద్రంలోని పాలకుల వైఫల్యానికి నిదర్శనం. వేలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంగా (ఆక్సిజన్ కొరత) మారినా, కేంద్రం దీనిపై సీరియస్‌గా దృష్టిసారించక పోవటం, ఒక పకడ్బందీ ప్రణాళిక లేకపోవటం వల్లే సమస్య తీవ్ర రూపం దాల్చిందని నిపుణులు చెబుతున్నారు.