Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరువనంతపురం పురపాలిక సంఘం ఘనత
తిరువనంతపురం : పరిపాలనలో కొత్త పుంతలు తొక్కే కేరళలో మరో అద్భుతం సాకారమయింది. లక్షణాలు లేని కరోనా రోగులకు గుమ్మం వద్దకే వైద్య సేవలు లభిస్తున్నాయి. తిరువనంతపురం కార్పొరేషన్ ఈ సేవలు అందిస్తుంది. రోగుల ఇళ్ల వద్దకే వైద్య బృందాలు వెళ్లి వారిని పరిశీలిస్తున్నాయి. అలాగే టెలిమెడిసిన్ సేవలను కూడా కార్పొరేషన్ అందుబాటులో ఉంచింది. ఈ విధంగా గుమ్మం వద్దకే వైద్య సేవలు అందించడం దేశంలోనే మొదటిసారని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇందు కోసం పట్టణ ప్రాధమిక వైద్య కేంద్రాలకు చెందిన వైద్యులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లక్షణాలు లేని రోగుల ఆందోళనను తగ్గించడానికి, ఆసుపత్రులపై ఒత్తిడిని నివారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతీ వైద్య బృందంలో ఒక డాక్టర్, ఒక ఫార్మాసిస్ట్, ఒక నర్స్, ఒక ల్యాబ్ టెక్నినిషియం ఉంటారు. అలాగే టెలిమెడిసన్ మద్దతు కోసం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో వైద్య బృందాలతో కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, రోగులను ప్రత్యక్షంగా వీక్షించడం అవసరమయితే, వీరు కూడా రోగుల ఇళ్లకు వెళతారని తిరువనంతపురం కార్పొరేషన్ కార్యదర్శి బిను ఫ్రాన్సిస్ తెలిపారు. అలాగే, ఈ వైద్య బృందాలను విస్తరించడం కోసం డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫిజియోధెరిపిస్టులు కావాలని కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వైద్య బృందాలకు సీనియర్ డాక్టర్లు గత రెండు రోజులుగా శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.