Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50శాతానికి మించితే చెల్లవు : సుప్రీం
- ఈ చర్య సమానత్వ ఉల్లంఘన : ధర్మాసనం
న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చటాన్ని సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. 50శాతం పరిమితి మించిన నేపథ్యంలో రిజర్వేషన్ చెల్లుబాటు కాదని చెప్పింది. 2018లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకుబడిన కులాల (ఎస్ఈబీసీ) చట్టం ప్రకారం మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. అయితే ఈ రిజర్వేషన్లపై రాజ్యాంగ సమ్మతిని పరిశీలించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం... ఈ చర్య సమానత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. పార్లమెంట్ చేసిన సవరణల వల్ల ఎస్ఈబీసీ జాబితాలో కులాన్ని చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని జస్టిస్ అశోక్ భూషణ్, ఎల్.నాగేశ్వరరావు, ఎస్. అబ్దుల్లా నజీర్, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు కులాలను గుర్తించి.. వాటి గురించి కేంద్రానికి సూచన మాత్రమే చేయాలని పేర్కొంది. 1992 మండల్ తీర్పులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం పున: సమీక్షించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమనీ, 50శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోయిందంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే రిజర్వేషన్లు కల్పించటం సరైనదేనంటూ ముంబయి హైకోర్టు సమర్థించగా.. గత ఏడాది దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు...ఆ తీర్పును నిలిపివేసింది.