Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరుణ.. దయ.. పాలన పట్టని మోడీ సర్కార్
- కరోనా విజృంభిస్తున్నా.. కనికరమేది? : ప్రజాసంఘాలు
ప్రపంచంలోనే ఏ దేశంలోలేని విధంగా కరోనా సెకండ్‌వేవ్ విరుచుకుపడుతుంటే.. బీజేపీ ప్రభుత్వం వితండవాదంతో నెగ్గుకురావాలని యోచిస్తున్నది. ఇప్పటికీ మతరాజకీయాలతోనే పావులు కదుపుతున్నది. కరోనా కేసులు రెండుకోట్లకుపైగా చేరుకున్నా.. తక్షణ చర్యలవైపు మోడీ ప్రభుత్వం దృష్టిసారించటంలేదని కోవిడ్ బాధిత కుటుంబాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తచేస్తున్నాయి.
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ అధికారపీఠాలు దక్కించుకోవటానికి మోడీగణం ఊరుకులు పరుగులు తీసింది. యావత్‌దేశాన్ని కరోనా బారినపడేసింది. ఓ వైపు సుప్రీంకోర్టు, దేశంలోని న్యాయస్థానాలూ బీజేపీ ప్రభుత్వాన్ని మందలించినా.. చలనం కనిపించటంలేదన్నట్టుగా వ్యవహరిస్తూనే ఉన్నది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ప్రళయం సృష్టిస్తున్నది. వాస్తవంగా ఢిల్లీకి 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరంకాగా, ఇప్పటికీ అందుతున్నది కేవలం 550 మెట్రిక్టన్నులే. సగానికి పైగా ఆక్సిజన్ అవసరమున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ ఓటర్లు తమకు ఓటువేయలేదని కక్షసాధిస్తున్నదా..? అనే ప్రశ్న జనంలో ఉదయిస్తున్నది. ఢిల్లీలో ప్రధాని మొదలుకుని, దేశ, విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు, రాజకీయనేతలు, బ్యూరోక్రాట్స్ ఉన్న ఢిల్లీనే మోడీ ప్రభుత్వం బేఖాతరుచేస్తున్నది.
ఢిల్లీలో కరోనా కష్టాలతో చలించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది. ఆక్సిజన్‌పై పెత్తనం వద్దు.. దీనికోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్రాలతో కలిసి ఓ ప్రణాళిక తయారు చేయాలనీ, ప్రత్యేకంగా ఎమర్జెన్సీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. ఏడాది కిందటే కరోనా వైరస్ జనం ప్రాణాలు తీశాక కూడా మోడీ క్యాబినెట్ నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది.
ఈ ఆక్సిజన్ కష్టాలకు కారణం ఏమిటి?
నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటును నిర్లక్ష్యం చేసింది. ప్లాంట్ నెలకొల్పుతామని 162 దరఖాస్తులు వస్తే.. వాటిని అటకెక్కించి చివరకు 32 దరఖాస్తులను క్లియర్ చేశారు. రూ.201 కోట్ల ఖర్చుతో నిర్మించటానికి ఇంత జాప్యం చేసింది. ఇప్పటికీ ఆ డబ్బులు కూడా విడుదలచేయలేదు.
యూపీలో చితిమంటలను చిత్రీకరిస్తే...
యూపీ గోరఖ్‌పూర్‌లోని శ్మశానవాటిక చుట్టూ సైన్‌బోర్డులు పెట్టారు. కరోనా చితిమంటలకు సంబంధించిన ఫోటోలు తీయటం హిందూ సంప్రదాయం.. సంస్కృతికి వ్యతిరేకమంటూ కొత్త మతవాదనను యూపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. వాస్తవానికి మృతుల సంఖ్య చెప్పటానికి సీఎం యోగి ఒప్పుకోవటంలేదు. ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉన్నా అంగీకరించటంలేదు. ఆక్సిజన్ సిలిండర్ కావాలని ఎవరైనా అడిగితే ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఆదేశాలివ్వటం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి యూపీలో చితిమంటల ఫొటోలు తీస్తే సంప్రదాయం గుర్తుకొచ్చిందా? ఈ శవాలు కాలుతుంటే.. దీనికి బాధ్యులెవరు..? దేశాన్ని తలదించుకునేలా చేస్తున్నదెవరు..?
మోడీకి పొగడ్తలతో సరి..
దేశంలో కరోనా కోరలుచాస్తుంటే.. దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలని అహర్నిశలు పనిచేయాల్సిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఓ ట్విట్ చేశాడు. అసోం, పుదుచ్చేరిలో విజయం సాధించినందుకు, పశ్చిమబెంగాల్లో 70 సీట్లు వచ్చినందుకు...మోడీని ప్రశంసిస్తూ హర్షవర్ధన్ ట్విట్ చేయటం వివాదస్పదమైంది. దేనికైనా ఓ హద్దు ఉండాలి కదా.. దేశంలో కరోనాతో జనం భయాందోళనలో ఉంటే.. ఇలాగేనా కేంద్ర ఆరోగ్యమంత్రి వ్యవహరించేది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.