Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింసాకాండను ఆపాలని విజ్ఞప్తి
- కొవిడ్ కట్టడికే తొలి ప్రాధాన్యత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెచే ప్రమాణం చేయించారు. వరుసగా మూడోసారి ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేప ట్టారు. ఈఎన్నికల్లో 294 స్థానా లకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలు గెలుచుకుంది. రికార్డుస్థాయిలో 47.9శాతం ఓట్లు సాధించారు. ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలందరూ మమతను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మమత మాట్లాడుతూ, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా చాలామంది కళ్ళు బెంగాల్‌పైనే వున్నాయని అన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని పూర్తిగా కట్టడి చేయడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఎన్నికల అనంతర హింసాకాండను విరమించి, శాంతిని కాపాడాల్సిందగా ఆమె విజ్ఞప్తి చేశారు. శాంతిని పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. హింస అంటే పశ్చిమ బెంగాల్‌కు ఇష్టముండదని, తాను కూడా అటువంటి వాటిని సహించనని స్పష్టం చేశారు. గత మూడు మాసాలుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పాలన సాగిందని, అందువల్ల కొంత అసమర్ధత తలెత్తిందని అన్నారు. ఇప్పుడు సరైన రీతిలో ప్రక్షాళనతో సరికొత్త చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఎన్నికల అనంతర హింసా ఘటనలను వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం వుందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అనైతికమని వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె సచివాలయానికి వెళ్లారు. కరోనా దృష్ట్యా ఉదయం 10.45గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించారు. కేవలం 50మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ముఖ్యమంత్రి మినహా మరెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు.