Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ ఎన్నికల్లో చేదు ఫలితాలు
- మోడీ నియోజకవర్గం వారణాసి, యోగి సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లలో ఓటమి
- అయోధ్య, లక్నోల్లోనూ ఎదురుదెబ్బ.. సత్తాచాటిన సమాజ్‌వాది పార్టీ
లక్నో : దేశంలో ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల చేదు ఫలితాలను మరవక ముందే బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి షాకిచ్చారు. ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి, యోగి సొంత జిల్లా గోరఖ్‌పూర్‌తో పాటు లక్నో, 'అయోధ్య'లోనూ బీజేపీ ఓటమి పాలైంది. తక్కువ సీట్లను గెలుచుకొని పేలవ ప్రదర్శనను చూపింది బీజేపీ. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన సమాజవాదీ పార్టీ (ఎస్పీ)సత్తా చాటింది. 3050 జిల్లా పంచాయతీ వార్డుల్లో ఎస్పీ 760 స్థానాలను గెలిచింది. బీజేపీ 719 వార్డులను మాత్రమే గెలచుకోగలిగింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 381స్థానాలను, కాంగ్రెస్ 76 వార్డులను చేజిక్కించుకున్నాయి.
ఇక స్వతంత్రులు, చిన్న పార్టీలే అత్యధికంగా 1,114 స్థానాలను దక్కించు కోవడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 40 జిల్లా పంచాయతీ స్థానాలకు గానూ.. బీజేపీ గెలిచింది 8 స్థానాలు మాత్రమే కావడం గమనార్హం. ఇక్కడ ఎస్పీ 14 సీట్లను, బీఎస్పీ ఐదు, అప్నాదళ్(సోనెలాల్) మూడు స్థానాలను పొందాయి. అయోధ్యలో 40 వార్డులకు ఎస్పీ 24 స్థానాలను చేజిక్కించుకున్నది. బీజేపీ మాత్రం కేవలం ఆరు సీట్లకు పరిమితమైంది. బీఎస్పీ ఐదు వార్డులను గెలుపొందింది. లక్నోలోని 25 వార్డుల్లో ఎస్పీ అత్యధికంగా 10 స్థానాలను గెలిచింది. బీజేపీ 6 వార్డులను మాత్రమే దక్కించుకున్నది. సీఎం యోగి సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లో కాషాయపార్టీకి ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఇక్కడ మొత్తం 68 వార్డులకు గానూ బీజేపీ 20 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎస్పీ 19 స్థానాలతో గట్టి పోటీనిచ్చింది.
యూపీలో 2022లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ తరుణంలో బీజేపీ కి చేదు ఫలితాలు ఎదురుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొని ఉన్నది. రైతుల నిరసనలు, కోవిడ్-19ను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, మైనార్టీలకు భద్రత కరువవడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో పనిచేశాయనీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతకు మించిన ఫలితాలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ఎస్పీ నాయకులు తెలిపారు.