Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనాతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమనటానికి పలు దేశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మహమ్మారి సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మన దేశంలో మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే వ్యాక్సిన్లు చేరుకోవడంలో జాప్యం నెలకొనడంతో.. 18 నుంచి 44 ఏండ్ల వయసు కలిగిన వారికి అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ పలు రాష్ట్రాల్లో అమలుకావటంలేదు. కేవలం 9 రాష్ట్రాలు మాత్రమే తాజా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇదంతా కేంద్రప్రభుత్వ డేటాలో వెల్లడైంది. దీని ప్రకారం.... 21 రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జమ్ముకాశ్మీర్, కర్నాటక, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే 18 నుంచి 44 ఏండ్ల మధ్య వారికి వ్యాక్సిన్ అందిస్తున్నాయి. మే 1నుంచి జరగాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇవి మొదలుపెట్టాయి. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లు ఒక్కొక్కటి మూడులక్షల డోసులను అందుకున్నాయి. ఢిల్లీ 4.5 లక్షల మోతాదులు అందుకోగా, జమ్ముకాశ్మీర్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు..1.5 లక్షల డోసుల చొప్పున అందుకున్నాయి. మొత్తం ఈ తొమ్మిది రాష్ట్రాలకు 22,50,000 వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందించింది. వీటన్నింటిలో గుజరాత్‌కు ఎక్కువగా వ్యాక్సిన్లు అందాయి. మోడీ సొంత రాష్ట్రం.. బీజేపీ పాలిత సర్కార్ కావటంవల్లే అక్కడకు ఎక్కువ వ్యాక్సిన్లు తరలిస్తున్నారని ఇతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.